సొంత బాబాయి వైఎస్ వివేకానందా రెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని సీఎం జగన్ తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొద్ది రోజులు క్రితం సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. వివేకా హత్యతో తమకు సంబంధం లేదని వెంకన్నపై ప్రమాణం చేసేందుకు తాను రెడీ అని, ఏప్రిల్ 14న జగన్ కూడా తిరుపతికి వస్తారా అని లోకేష్ సవాల్ విసిరారు.
అయితే, ఆ సవాల్ కు జగన్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తాను అన్నమాట ప్రకారం చెప్పిన సమయానికి అలిపిరి వద్దకు వచ్చిన నారా లోకేష్…అక్కడే బైఠాయించారు. వివేకా హత్య కేసులో తన కుటుంబానికి ప్రమేయం లేదని ప్రమాణం చేయడానికి అలిపిరి వద్దకు వచ్చానని, తన సవాల్ ను స్వీకరించి జగన్ అలిపిరికి వస్తారని ఎదురు చూస్తున్నానని లోకేష్ తెలిపారు.
‘వైఎస్ జగన్.. బాబాయిని చంపింది ఎవరో ఈ రోజు తేలిపోతుంది. నేను రెడీ.. నువ్వెక్కడ? తిరుపతి వచ్చి వెంకన్న సాక్షిగా వివేకా గారి హత్యతో నీకు, నీ కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చెయ్యి. రాకపోతే వివేకా గారిని వేసేసింది అబ్బాయే అనే విషయం ప్రపంచానికి అర్థమవుతుంది’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
అయితే, జగన్ వచ్చే సూచనలు కనిపించకపోవడంతో సవాల్ పై ఆయన వెనుకంజ వేశారని భావించి మరికాసేపట్లో గరుడ సర్కిల్ దగ్గర లోకేష్ ఒక్కరే ప్రమాణం చేయనున్నారని తెలుస్తోంది. తన ఛాలెంజ్ ప్రకారం ప్రమాణానికి రెడీ అయిన లోకేష్ మాట తప్పకుండా చెప్పిన చోటికి వచ్చారు. నారా లోకేష్ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
వారం రోజుల క్రితం సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో తిరుపతి ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేష్ ఈ సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఇటు జగన్, అటు వైసీపీ నేతలు స్పందించలేదు. ఇప్పటికే వైఎస్ సునీత అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వని జగన్…అసలు వివేకా హత్య కేసుపై నోరు మెదపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.