‘ముక్కాలా ముక్కాబులా లైలా .. ఓహో లైలా’ అంటూ 30 ఏళ్ల క్రితం యువతను ఉర్రూతలూగించిన ప్రేమికుడు సినిమాలోని పాట, దానికి ప్రభుదేవా డ్యాన్స్ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ సినిమా, అందులోని పాటలు ఓ సంచలనం.
అర్జున్ హీరోగా జెంటిల్ మెన్ సినిమాతో అందరిదృష్టిని ఆకర్షించిన దర్శకుడు ఎస్.శంకర్ ఆ సినిమాలో ‘చుకు బుకు చుకు బుకు రైలే’ పాటలో నృత్య దర్శకుడు ప్రభుదేవా మీదే చిత్రికరించి కొత్త వరవడికి దారితీసాడు. తన తదుపరి సినిమాలో ఆయన ఏకంగా ప్రభుదేవానే హీరోగా పెట్టి ‘ప్రేమికుడు’ సినిమా తీయడం ఒక సాహసమే.
శంకర్ మార్క్ టేకింగ్, ప్రభుదేవా డ్యాన్సర్లు, నగ్మా అందాలు ప్రేక్షకులను అలరించడంతో సినిమా సంచలన విజయం నమోదు చేసుకున్నది. ఈ సినిమా నుండే ప్రభుదేవా హీరోగా, తర్వాత దర్శకుడిగా మారాడు.
తాజాగా పాత సినిమాల రీ రిలీజ్ ల వరవడి కొనసాగుతున్న నేపథ్యంలో 30ఏళ్ల క్రితం విడుదలైన ‘ప్రేమికుడు’ సినిమా మే 1న మళ్లీ 300లకు పైగా థియేటర్లలో ఘనంగా
విడుదల కానున్నది
తాజాగా బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రజలనుండి అద్భుతమైన స్పందన వస్తున్నదని చెబుతున్నారు. మూడు దశాబ్దాల ఈ సినిమాను నేటి యువత ఎలా ఆస్వాదిస్తారో వేచిచూడాలి.