టాలీవుడ్ సీనియర్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారన్న సంగతి తెలిసిందే. ఆయన బాబాయి కోన రఘుపతి వైసీపీ ఎమ్మెల్యే. 2019 ఎన్నికల ముంగిట ఆయన కోసం వైసీపీలో చేరి ఎన్నికల ప్రచారం కూడా చేశారు కోన వెంకట్. ఐతే ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు గుప్పించి ఆయన అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు కోన. ఒకప్పుడు పవన్ను సోల్ మేటి అని చెప్పుకుని.. ఆ తర్వాత ఆయన్ని తీవ్రంగా విమర్శించడం అభిమానులకు అస్సలు రుచించలేదు.
అప్పట్నుంచి సోషల్ మీడియాలో కోన వెంకట్ ఎదుర్కొంటున్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు. తాను ఏదైనా పోస్టు పెడితే.. కింద పేటీఎం కుక్క అంటూ దారుణంగా తిడతారంటూ ఇటీవల ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ఇంటర్వ్యూలో కూడా వాపోయాడు కోన. ఈసారి ఎన్నికల ముంగిట తీవ్ర ఎదుర్కొంటున్న జగన్ సర్కారుకు అనుకూలంగా కోన వెంకట్ పెడుతున్న పొలిటికల్ పోస్టుల పట్ల వస్తున్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు. సరైన అవగాహన లేకుండా.. వాస్తవాలను మరిపిస్తూ కోన పోస్టులు పెడుతుండటమే అందుక్కారణం.
మొన్న బాపట్లలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఫొటోలు పెట్టి ఓ మై గాడ్ ఇది కార్పొరేట్ హాస్పిటల్ కాదు.. ప్రభుత్వ ఆసుపత్రి అంటూ ఆశ్చర్యపోతూ పోస్టు పెట్టాడు కోన. ఐతే ఏదో ఒక హాస్పిటల్ ఇలా చేశారని.. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలే మారిపోయినట్లు కోన పోస్టు పెట్టడంతో తీవ్ర విమర్శలు తప్పలేదు. ఒక్క రోజు గడవగానే ఆత్మకూరులోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ లేక, జనరేటర్ కూడా అందుబాటులో లేక చిన్న పాప చనిపోయిన వీడియో చక్కర్లు కొడుతోంది. దీంతో కోనకు బ్యాండ్ తప్పట్లేదు. ఇక తాజాగా కోన ఇంకో పోస్టు పెట్టాడు.
ఇది హైదరాబాద్లోని విల్లా కమ్యూనిటీ కాదు.. బాపట్లలో జగనన్న కాలనీ అంటూ ఒక కొత్త ఇంటి ముందు ఫొటో దిగి పోస్టు పెట్టాడు జగన్. వాస్తవానికి అది ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కట్టిన ఇల్లు. ఆ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం 30 వేలిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ 30 వేలు కూడా కేంద్రమే తర్వాత వెనక్కి ఇస్తుంది. వాస్తవం ఏంటంటే.. గత పది నెలలుగా ఆ 30 వేలు కూడా ఇవ్వకుండా పెండింగ్లో పెట్టేసిందట జగన్ ప్రభుత్వం. ఈ వాస్తవాలన్నీ కప్పి పెట్టి జగన్ ప్రభుత్వానికి కోన వెంకట్ ఎలివేషన్ ఇవ్వాలని చూడడంతో కింద కామెంట్లలో ఆయన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇలా కోన పెడుతున్న ప్రతి పోస్టూ బూమరాంగ్ అవుతుండడం గమనార్హం.