నాయకుల విద్యార్హతలను ప్రశ్నించ కూడదని ఓ సందర్భంలో యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్య.. ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటంది. బీకాంలో ఫిజిక్స్ చేశామని చెప్పిన వారు మనకు తెలిసిన నాయకులే. సీఏపీలో పాలిటిక్స్ చదవిన సీమ ఎంపీ కూడా.. దశాబ్దం కిందట సంచలనమే సృష్టించారు. ఇక, సీఎంగా ఉన్న జగన్ ఏం చదివారనేది ఇప్పటికీ అతి పెద్ద రహస్యం అయితే.. ప్రధాని మోడీ ఏం చదివారని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసు పెడతామని గుజరాత్ యూనివర్సిటీ ఏకంగా ప్రకటనే జారీ చేసింది. సో.. ఇవీ.. కొందరు నాయకుల చదువలకు సంబంధించిన సమాచారం.
అయితే.. తాజాగా ఏపీలో వెలుగు చూసిన సమాచారం.. దీనికి కొంత భిన్నం. విశాఖపట్నం ఎంపీగా ఉన్న వైసీపీ నాయకుడు, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సినీ నిర్మాత కూడా అయిన.. ఎంవీవీ సత్యనారాయణ విద్యార్హతల వెల్లడిలో అందరినీ మించి పోయారు. ఆయన తాజాగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున ఆయన వేసిన అఫిడవిట్లో తన విద్యావిషయాలకు సంబంధించిన ఆసక్తికర ఆశ్చర్యకర విషయాలను పంచుకున్నారు. అవేంటంటే.. ప్రస్తుతం ఆయన పీహెచ్డీ చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో తప్పేముంది? అనుకుంటున్నారా? ఏమీ లేదు. కానీ, ఆయన 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు.. ఇచ్చిన అఫిడవిట్‌ను చూస్తే..ఈ పీహెచ్డీ వెనుక ఉన్న పితలాటకం ఇట్టే అర్ధమవుతుంది.
2019 అఫిడవిట్లో ఎంవీవీ తన విద్యార్హతను.. 10వ తరగతి పాస్‌గా పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తాను పీహెచ్డీ చచేస్తున్నట్టు తెలిపారు. ఇక్కడే ఉంది అసలు సమస్య. 2019కి 2024కి మధ్య గ్యాప్ 5 సంవత్సరాలు. అప్పట్లో పదో తరగతి చదివిన ఎంవీవీ ఇంటర్ చేయడానికి రెండేళ్ల సమయం పడుతుంది. తర్వాత.. డిగ్రీ, పీజీ చేయడానికి ఐదేళ్లు పడుతుం ది. అంటే.. ఇంకా చెప్పాలంటే.. ఎంవీవీ చదువుపైనే దృష్టి పెట్టి ఉంటే.. ప్రస్తుతం ఆయన పీజీలోకి వచ్చి ఉండాలి. కానీ, పీహెచ్డీ చేస్తున్నట్టు చెప్పారు.
అలా కాదు.. నేను డిస్టెన్స్‌లో ఇంటర్ లేకుండా డిగ్రీ చేశానని అనుకున్నా.. ఆయన డిగ్రీ చేయడానికి మూడేళ్లు.. తర్వాత.. పీజీ రాయడానికి మరో రెండేళ్లయినా.. పడుతుంది. అప్పుడు కూడా.. పీహెచ్డీ చేసేందుకు సమయం లేదు. ఎందుకంటే.. ఎంఫిల్ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. తర్వాత.. పీహెచ్డీ కి అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రధాన సమస్య అయింది. మరి టీడీపీ ఊరుకుంటుందా? ఉండదుకదా.. ఎమ్మెల్యే అబ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ఫిర్యాదు చేశారు. కానీ, ఆర్వో తాను చేయాల్సిన పని తాను చేసి.. అనుమతించేశారు. పైగా.. ఇది చిన్న విషయమేనని తోసిపుచ్చారు. ఇదీ సంగతి!!