గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా జగన్ నవ రత్నాలు అంటూ మేనిఫెస్టో ను ఈ రోజు విడుదల చేశారు. గత హామీలను అమలు చేసేందుకు అప్పుల తిప్పలు పడ్డ జగన్ కొత్తగా హామీలు ఇచ్చే పరిస్థితుల్లో లేరని విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఈ మేనఫెస్టోపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. గత ఎన్నికలకు ముందు జగన్ అమలు చేయని హామీలను ప్రస్తావిస్తూ చంద్రబాబు చురకలంటించారు. పూర్తిగా 100 శాతం సన్నబియ్యం, సీపీఎస్ రద్దు, అందరికీ 45 ఏళ్లకే పెన్షన్, ప్రత్యేక హోదా వీడియో క్లిప్పింగ్స్ ను చంద్రబాబు ట్వీట్ చేసి జగన్ పరువు తీశారు.
గత ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన 730 హామీల్లో ఇవి కొన్ని అని, ఆ హామీలు అమలు చేస్తానంటూ కేకలేసిన జగన్ వీటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 85 శాతం హామీలను నెరవేర్చలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. మరోసారి ఇంకో మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయడానికి వచ్చాడని విమర్శించారు. “మళ్లీ ఇంకోసారి మోసపోవడానికి మీరు సిద్ధమా? అని జగన్ అడుగుతాడంలూ పంచ్ లు వేశారు. నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం అని మీరు కూడా గట్టిగా చెప్పండి” అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
వైసీపీ మేనిఫెస్టో-2024
పెన్షన్ రూ.3,500 (రెండు విడతల్లో) పెంపు
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిస్తున్న మొత్తాన్ని 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు
అమ్మ ఒడి పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని 2 వేలు పెంచి రూ. 17 వేలు అందిస్తామని హామీ
వైస్సార్ రైతు భరోసా రూ.16 వేలు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు
వైఎస్సార్ కాపు నేస్తం లబ్దిదారులకు ఇప్పుడిస్తున్న రూ.60 వేలను నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలకు పెంచుతామని వెల్లడి
ఈబీసీ నేస్తం కింద ఇప్పుడిస్తున్న రూ. 45 వేల మొత్తాన్ని రూ.1.05 వేలకు పెంపు (నాలుగు దఫాల్లో)
వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం.. అర్హులైన పేదవాళ్లకు ఇళ్లు
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, విద్యాకానుక పథకాల కొనసాగింపు
లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా