జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ఏపీలో రూపాయి విలువ పతనమైందని, నిత్యావసరాల ధరలు పెరిగాయని మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSPI నివేదికలో వెల్లడైంది. మన దేశంలో ఏపీలోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని నివేదికలో వెల్లడి కావడంతో వైసీపీ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీలో ద్రవ్యోల్భణం పెరుగుదలకు జగనే కారణమని దుయ్యబట్టారు. ఏపీలో జే టాక్స్ టెర్రరిజం కొనసాగుతోందని, జనాల జేబులకు జగన్ చిల్లులు వేస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా జగన్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఏపీలో ద్రవ్యోల్బణం అధికంగా నమోదయిందని లోకేష్ అన్నారు. సంక్షేమ పథకాలంటూ జనం సొమ్మును జగన్ దుబారా చేస్తున్నారని, అందుకే ఏపీలో రూపాయి విలువ పడిపోయిందని మండిపడ్డారు. ఏపీలో నిత్యావసరాల సరుకుల ధరలు తగ్గించాలని లోకేష్ డిమాండ్ చేశారు.