ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి విదేశాలకు పరారయ్యాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. అతన్ని తిరిగి దేశానికి రప్పించేందుకు భారతదేశం విశ్వప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు.
ఇండియా నుండి పారిపోయిన విజయ్ మాల్యా 2016 నుండి లండన్ లో నివసిస్తున్నాడు. కానీ భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడికి రప్పించడం సాధ్యం కావడం లేదు. భారత్ నుండి పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించినా, ఇక్కడ ఉన్న ఆయన ఆస్తులు వేలం వేసి అమ్మేసినా రప్పించడం మాత్రం సాధ్యం కాలేదు.
వ్యవస్థీకృత నేరాలు, కౌంటర్ టెర్రరిజంపై ఉమ్మడి పోరులో భాగంగా ఫ్రాన్స్ తో ఇటీవల భారత ప్రభుత్వంతో జరిగిన ద్వైపాక్షిక వర్కింగ్ గ్రూప్ 16వ సమావేశంలో భారత్ మాల్యా అప్పగింత అంశాన్ని ప్రస్తావించింది. విజయ్ మాల్యా ఒకవేళ ఫ్రాన్స్ కు వస్తే ఆయన్ను ఎలాంటి షరతులు లేకుండా తమకు అప్పగించాలని కోరింది.
నేరస్తుల అప్పగింతపై ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరిన దేశాల్లో మాల్యా పర్యటిస్తేనే ఆయనను భారత్ కు అప్పగించడం వీలవుతుంది. కొన్ని షరతులతో ఫ్రాన్స్ ఒప్పుకున్నా .. షరతులు లేకుండా అప్పగించాలని భారత్ కోరడం మూలంగా ఇది సాధ్యం కావడం లేదు. అసలు విజయ్ మాల్యాను రప్పించడం సాధ్యమేనా ? కాదా ? వేచిచూడాలి.