అధికారంలో ఉన్నప్పుడు సినీ పెద్దలతో ఏపీ సీఎం జగన్ అహంకార భావంతో వ్యవహరించారనే విమర్శలున్నాయి. అందుకే ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ ముందుకు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క పోసాని కృష్ణమురళీ తప్ప జగన్ గురించి మాట్లాడే సినిమా వాళ్లే లేరన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోనే సినిమా పరిశ్రమ నుంచి మద్దతు కోసం ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ను జగన్ తనవైపు తిప్పుకున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా వైసీపీకి మద్దతుగా దిల్ రాజు ఓ వీడియో రిలీజ్ చేయడమే అందుకు కారణం.
వచ్చే ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి దిల్‌రాజు మద్దతు ప్రకటించారు. వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. బాలినేనిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని ఒంగోలు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నేతకు ఓటు వేయాలని దిల్‌రాజు విన్నవించారు. అంతే కాకుండా బాలినేని రాజకీయ ప్రస్థానంపై ఓ డాక్యుమెంటరీ రూపొందించానని, అందరూ ఇది చూడాలని దిల్‌రాజు పేర్కొన్నారు. బాలినేని గొప్ప నేత అని ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు. వైసీపీని గెలిపించాలన్నారు.
అయితే సినిమా పరిశ్రమ నుంచి మద్దతు లేకపోతే కష్టమని భావించిన జగన్ ఇప్పుడు దిల్‌రాజుకు గాలం వేశాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో అలీ, పృథ్వీ జగన్‌కు మద్దతునిచ్చారు. కానీ అలీ సైలెంట్ అయిపోయారు. పృథ్వీ ఏమో జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు జనసేన అధినేతకు అండగా సినిమా పరిశ్రమ పెద్ద దిక్కు చిరంజీవి నిలబడ్డారు. కూటమికి ఓట్లు వేయాలని కోరుతున్నారు. అంతే కాకుండా కొరియోగ్రాఫర్ జానీ, కమెడియన్లు ఆది, రాంప్రసాద్, గెటప్ శ్రీను తదితరులు పవన్ విజయం కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.