ఈ టెక్ జమానాలో ఫేక్ ఆడియో టేపులు, మార్ఫింగ్ వీడియోలు, ఏదో వీడియోకు మరేదో ఆడియో పెట్టి అతికినట్టు మిక్సింగ్ చేయడాలు…ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి. చాలా సందర్భాల్లో పలువురు రాజకీయ నాయకులను దీటుగా ఎదుర్కొనలేక దొంగదెబ్బ తీసేందుకు ఈ తరహా నీచ కార్యక్రమాలకు కొందరు ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సంభాషణలను తమకు అనుకూలంగా వక్రీకరించుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూసేవారు మరికొందరు.
ఈ కోవలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడుకు సంబంధించిన వీడియో ఒకటి వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేశ్ గురించి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యాలు తీసి మరీ కొందరు పైశాచికానందం పొందుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ పైఅచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. దొంగ సాక్షి చానెల్ లో ఎన్ని తప్పుడు వీడియోలు తీసుకొచ్చినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవంటూ జగన్ కు అచ్చెన్నా వార్నింగ్ ఇచ్చారు.తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే నిన్న చంద్రబాబుపై రాళ్లదాడిని జగన్ చేయించారని, ఇపుడు తన సంభాషణలను వక్రీకరించారని దుయ్యబట్టారు.
” వివేకా హత్యపై నారా లోకేశ్ విసిరిన సవాల్ కు తోకముడిచావు. నువ్వెన్ని విషపన్నాగాలు పన్నినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేవు… నారా లోకేశ్ తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు” అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దొంగ సాక్షి చానెల్లో ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవని మండిపడ్డారు. ఎన్ని విష పన్నాగాలు పన్నినా టీడీపీ విజయాన్ని ఆపలేవని జగన్ను అచ్చెన్న హెచ్చరించారు.