విధానపరమైన అంశాల గురించి విమర్శలు చేస్తే వివరణ ఇవ్వరు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. రాష్ట్రానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి నిలదీస్తే స్పందించరు. ప్రతిపక్ష నేతలు, మేధావులు, చివరకు తోడ పుట్టిన చెల్లి, ఎవరైనా సరే ప్రశ్నిస్తే.. వారిపైనే ఎదురుదాడి చేయడం, బురదజల్లడం.. సోషల్ మీడియాలో అయితే నీచమైన పోస్టింగ్‌లు పెట్టించడం! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ తీరు ఇదీ. ఇంతకాలం తనకు రాజకీయంగా ఎదురొచ్చిన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై చౌకబారు విమర్శలు చేసినట్టుగానే… ఇప్పుడు సొంత చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంలోనూ జగన్ అదే చేస్తున్నారు.
ఇక వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ మద్దతుదారులైతే మరింత దారుణం. మహిళ అని కూడా చూడకుండా షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నీచమైన పోస్టింగ్‌లు పెడుతున్నారు. తన కుమారుడి వివాహానికి ప్రతిపక్ష నేతలను షర్మిల ఆహ్వానిస్తే.. దానికి కూడా వక్రభాష్యం చెబుతున్నారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న పోస్టు పెడితే సీఐడీని ఉసిగొల్పి అరెస్టు చేయించిన జగన్.. ఇప్పుడు తన సొంత చెల్లెలిపై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేస్తున్నా స్పందించడం లేదు. రక్తసంబంధాన్ని మరచిపోయి ఆమెను శత్రువుగా చూస్తున్నారు.
గతాన్ని మరచి..
గతంలో అవినీతి కేసుల్లో జగన్ జైలుకు వెళ్లినపుడు, వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు షర్మిల అండగా ఉన్నారు. ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ తెరపైకి వచ్చి.. వైసీపీ తరఫున ఊరూరా ప్రచారం చేశారు. పాదయాత్ర కూడా చేశారు. జగన్ కోసం, వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డారు. అయితే చెల్లి సేవలను వాడుకోవడమే తప్ప జగన్ ఏనాడూ ఆమెకు రాజకీయ పదవులు ఇవ్వలేదు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక ఆమెను పూర్తిగా పక్కన పెట్టారు. షర్మిలను రాజకీయంగా ఎదగనివ్వలేదు. ఆస్తులు పంచలేదు, అయినా ఏనాడూ జగనకు వ్యతిరేకంగా షర్మిల పెదవి విప్పలేదు.
కానీ రానురాను తనపై కుటుంబపరంగా, రాజకీయంగా వైసీపీ నుంచి దాడులు మొదలయ్యే సరికి.. తెలంగాణకే పరిమితమైన ఆమె నవ్యాంధ్రలోనూ కాలుమోపి అన్నను ఎదుర్కోవాలని నిర్ణయించారు. అందుకు కాంగ్రెస్ పార్టీయే సరైన వేదిక అని భావించి.. తన వైఎస్ఆర్టీపీని అందులో విలీనం చేశారు. ఆంధ్ర పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టి.. జగన్‌పై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. రక్త సంబంధాన్నే కాదు.. గతంలో పార్టీకి ఆమె చేసిన సేవలను కూడా మరిచిపోయి ఎదురుదాడికి దిగుతున్నారు.
ఇరకాటంలో జగన్
కాంగ్రెస్ రాష్ట్రంలో నీచరాజకీయాలు చేస్తోందని, తమ కుటుంబంలో చీలిక తెస్తోందని పరోక్షంగా షర్మిలను ఉద్దేశిస్తూ జగన్ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ తన కుటుంబాన్ని చీల్చలేదని, జగనే ఇందుకు కారణమని, ఆ దేవుడు, తన తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులే ఇందుకు సాక్ష్యమంటూ షర్మిల తిప్పికొట్టారు. మణిపూర్ హింసలో వేలాది క్రైస్తవ కుటుంబాలు ఊచకోతకు గురైతే.. ఒక క్రిస్టియనగా ఎందుకు స్పందించలేదని జగనను షర్మిల నిలదీశారు. ఇలా కుటుంబ విషయాలు సహా రాష్ట్రాభివృద్ధికి చెందిన కీలక అంశాలపై నేరుగా జగన్‌ను ప్రశ్నించారు. జగన్ పాలనా వైఫలాన్ని ఎత్తి చూపారు.
ఈ పరిణామాలన్నీ జగన్‌ను ఇరకాటంలో పెట్టాయి. వైసీపీకి అండగా ఉంటున్న క్రైస్తవ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు వెళ్తుందని ఆందోళన చెందుతున్నారు. జగన్ నియంతృత్వ పోకడల గురించి ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. ఇప్పుడు స్వయంగా సోదరి షర్మిల తాడేపల్లి ప్యాలెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టడంతో జగన్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ నేతల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వైసీపీ అసంతృప్తులు, వైఎస్ అభిమానులు ఆ పార్టీ దిశగా అడుగులేస్తున్నారు.
షర్మిల వద్దకు వైవీ
షర్మిల శక్తియుక్తులు తెలిసిన జగన్.. ఆమె పీసీసీ సారథ్య బాధ్యతలు తీసుకోకముందే చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిని ఆమె వద్దకు రాయబారానికి పంపారు. ఏపీకి రావద్దనేదే దీని సారాంశం. ఆంధ్రలో జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అది కుటుంబంలో చిచ్చు పెట్టినట్లవుతుందని, అది ఎవరికీ మంచిది కాదని షర్మిలకు సుబ్బారె డ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇన్నాళ్లూ మేం రోడ్డున పడితే ఎవరు పట్టించుకున్నారు? నాకు అన్యాయం జరిగిందని నెత్తీ నోరూ బాదుకుంటే ఆ రోజు మీరెందుకు రాయబారం నడపలేదు? నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ముఖం చూడలేదు.
ఏపీకి వస్తానంటే మాత్రం రాయబారానికి వచ్చారా? ఏనాడైనా నా తరఫున మాట్లాడారా? నాకు ఊరట కలిగించేలా చేశారా? నేను ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. అప్పుడెప్పుడూ లేనిది, ఇప్పుడు జగన్‌కు ఇబ్బంది అవుతుందని నా దగ్గరకు వచ్చారు. నా ఆలోచనలు నాకున్నాయి. నా మానాన నన్ను బతకనివ్వండి’’ అని షర్మిల కుండబద్దలు కొట్టారు. ఈ పరిస్థితుల్లో ఆయన వచ్చి ఉండకూడదని, తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా అన్నారు. ‘అదేంటమ్మా.. మనమంతా ఒకే కుటుంబం కదా’.. అని సుబ్బారెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేయగా… ‘నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు కుటుంబంలో నేనూ ఒకరినన్న విషయం గుర్తులేదా’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివిధ అంశాలపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోని జగన్.. అవే అంశాలపై షర్మిల విమర్శలను భరించలేకపోతున్నారు. పైగా తన తండ్రి పాలనతో పోల్చి మాట్లాడుతూ ఆమె విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, విజయవాడకు మెట్రో, రాజధాని, పరిశ్రమలు, నిరుద్యోగం, రోడ్లు, జాబ్ కేలండర్, మద్యనిషేధం హామీ, అప్పులు, గంగవరం పోర్టు, దళితులపై దాడులు వంటి కీలకమైన అంశాలను ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో జగన్ సర్కారు సంబంధాలను ఎండగడుతున్నారు. వాటిలో ఒక్కదానికి కూడా జగన్ గానీ, వైసీపీ నేతలు గానీ సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఎంతకు దిగజారేందుకైనా సిద్ధపడుతున్నారు.