దస్తగిరికి వంద మందితో భద్రత? అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. సీఎం జగన్ పులివెందుల నుంచి మరోసారి పోటీచేస్తున్న నేప థ్యంలో ఆయన గురువారం నామినేషన్ వేసేందుకు వెళ్లనున్నారు. వాస్తవానికి ఇప్పటికే.. ఆయన తరఫున చిన్నాన్న ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. ఎందుకైనా మంచిదని.. మరోసారి నేరుగా సీఎంజగన్ నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు. గురువారం ఆయన నామినేషన్ వేయనున్నట్టు పార్టీ కార్యకర్తలు , నాయకులకు తెలిపారు.
దీంతో పులివెందులలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్న జగన్.. నామినేషన్ సహా అఫిడవిట్ పత్రాలను సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. తర్వాత.. ఆర్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. పెద్ద ఎత్తున తరలి వచ్చేలా పార్టీ ఏర్పాటుచేసింది.
కట్ చేస్తే.. మరోవైపు సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్యలో నిందతుడు, ప్రస్తుత అప్రూ వర్గా మారి బెయిల్‌పై ఉన్న దస్తగిరి కూడా.. పులివెందుల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈయన న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ స్థాపించిన `జై భీం రావ్`(జెబీఆర్) పార్టీ తరఫున నామినేషన్ కూడా దాఖలు చేశారు. సీఎం జగన్‌ను ఓడిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దస్తగిరికి ఇప్పటికే పోలీసులు భద్రతను 4+4 చొప్పున పెంచారు.
కానీ, తాజాగా సీఎం జగన్ పులివెందులలో పర్యటిస్తుండడం.. నామినేషన్ పత్రాలు వేస్తున్న క్రమంలో దస్తగిరిపై భౌతిక దాడులు జరిగే అవకాశం ఉందని.. ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. అదే సమయంలో దస్తగిరి ఇంటిపైనా దాడులు జరిగే ఛాన్స్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరి ఇంటికి.. 70 మంది(మూడు షిప్టుల్లో) పోలీసులతో భద్రత కల్పించారు. అలాగే దస్తగిరికి 30 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతను రెండు రోజులు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.