బయటకు ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎవరెంతగా తిట్టుకున్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. వీళ్ల పొలిటికల్ ఫ్రెండ్షిప్ ఎంతో స్ట్రాంగ్ అని చెబుతుంటారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలతో అది మరోసారి స్పష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని కేసీఆర్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
ఓ టీవీ ఛానల్ షోలో పాల్గొన్న కేసీఆర్.. ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారని అనుకుంటున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ ఎన్నికల్లో జగన్ గెలుస్తారన్న సమాచారం ఉందని కేసీఆర్ తెలిపారు. ఏపీలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మిత్రులేనని అయితే తనకు అందిన సమాచారాన్ని బట్టి జగన్ గెలుస్తారని తెలుస్తోందన్నారు. ఏపీ రాజకీయాలతో తమకు సంబంధం లేదని కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని పేర్కొన్నారు.
ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని కేసీఆర్ చెప్పడంతో మరోసారి వీళ్ల మధ్య ఉన్న రహస్య స్నేహం బయటపడిందనే టాక్ వినిపిస్తోంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం జగన్ సాయం చేశారనే అభిప్రాయాలున్నాయి. అందుకు ప్రతిఫలంగా 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీని ఓడించి, జగన్‌ను గెలిపించేందుకు కేసీఆర్ కసరత్తులు చేశారని చెబుతుంటారు. తెలంగాణలో అసలు టీడీపీన ఉనికే లేకుండా ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో కేసీఆర్ చేర్చుకున్న సంగతి తెలిసిందే.
2019లో ఏపీలోనూ టీడీపీ గెలవకుండా కేసీఆర్ జగన్‌కు సాయం చేశారని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేకపోయినా జగన్ గెలుపు కాంక్షిస్తున్నారని టాక్. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడని సంగతి తెలిసిందే. కానీ జగన్‌పై రాయి దాడి జరగ్గానే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ వెంటనే స్పందించారు. ఇక కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ, తెలంగాణ విషయంలో వైసీపీ, బీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. కానీ అవి కేవలం బయటకు మాత్రమేననే టాక్ ఎప్పటి నుంచో ఉంది.