2019 ఎన్నికలకు ముందు ఏదైతే వైసీపీ అధినేత జగన్ గెలుపులో కీలకంగా మారి, పార్టీని అధికారంలోకి తెచ్చిందో ఇప్పుడదే ఆయనకు మైనస్‌గా మారుతోంది. అప్పుడు ఏ విషయంపై సింపతీతో పీఠమెక్కాడో.. ఇప్పుడదే విషయంలో నెగెటివిటీ కొంపముంచనుంది. అవును.. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్న అభిప్రాయాలు ఇలాగే ఉన్నాయి. మరి అప్పుడు జగన్‌ను గెలిపించింది, ఇప్పుడు ఓడించబోతోంది ఏంటీ అంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అని చెబుతున్నారు.
2019 ఏపీ ఎన్నికలకు ముందు వివేకా హత్య కావడం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ హత్యను టీడీపీ ప్రభుత్వంపైకి నెట్టేసి హంతకులు వాళ్లే అన్నట్లు మాట్లాడేసి జగన్ లబ్ధి పొందారనే విమర్శలున్నాయి. వివేకా మరణాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్లో సింపతీతో అధికారంలోకి వచ్చారనే ఆరోపణలున్నాయి. కానీ అధికారంలోకి వచ్చి అయిదేళ్లయినా వివేకా హత్య కేసు ఎటూ తేలలేదు. దీనిపై ఇంకా సీబీఐ విచారణ సాగుతూనే ఉంది. ఇప్పటివరకూ సీబీఐ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న దాని బట్టి కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని చెబుతున్నారు. కానీ ఇంకా ఎలాంటి ముందడుగు పడటం లేదు.
ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అటు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా తనయ వైఎస్ సునీతనేమో అవినాష్ రెడ్డి హంతకుడని, దీని వెనుక ఉన్నది జగన్ అని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రాష్ట్రమంతా ఇదే విషయాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు దస్తగిరి కూడా జగన్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తమ వాళ్లు చెప్పినట్లు చేయాలని, ఏమైనా సమస్య వస్తే అన్నీ తాను చూసుకుంటానని జగన్ ఫోన్లో చెప్పారని దస్తగిరి వెల్లడించారు.
ఇక తాను అప్రూవర్‌గా మారతానని చెప్తే జగన్ దంపతులు కూడా జైలుకు వెళ్తారని తనను బెదిరించారని కూడా దస్తగిరి పేర్కొన్నారు. దీంతో జగన్ మెడకు వివేక హత్య మరింత గట్టిగా చుట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి కర్మలకు వాళ్లే బాధ్యులు. ఎప్పటికైనా ఫలితం అనుభవించాల్సిందే. వివేకా హత్యలో నేరస్తులు ఎవరన్నది కోర్టు తేలుస్తుంది. కానీ అంతకమందే ముందే ప్రజలు తమ తీర్పుతో జగన్ ఓడించే అవకాశం ఉందన్నది పొలిటికల్ టాక్.