జనసేన అధినేత పవన్ .. ఎన్నికల్లో కీలక ఘట్టమైన.. నామినేషన్ల దాఖలు ప్రక్రియను పూర్తి చేశా రు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్.. మంగళ వారం ఈ పిటిషన్ను సమర్పించారు. అయితే.. ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. నామినేషన్ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తొలుత తను ఉంటున్న చేబ్రోలు నివాసంలోనే మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం.. అక్కడే నామినేషన్ పత్రాలను ఉంచి.. పూజలు చేసుకున్నారు. తర్వాత చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ తన పార్టీ కార్యకర్తలు, అభిమానులు తోడు రాగా.. భారీ ర్యాలీగా బయల్దేరారు. పిఠాపురం పాదగయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను పవన్ అందించారు. ఇక, ఈ కార్యక్రమం మధ్యాహ్నం 11 గంటలకు ప్రారంభం కాగా.. రెండు గంటలకు పైగా ర్యాలీ జరిగింది. నామినేషన్ దాఖలు సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి వర్మ ఇతర నాయకులు ఉన్నారు. అనంతరం.. పార్టీ కార్యకర్తలు, నాయకులకు అభివాదం చేసిన పవన్.. తిరిగి తన నివాసానికి చేరుకున్నారు.