వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నేతలకు నాలుగేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన నరసాపురం రెబల్ ఎంపీ, టీడీపీ నేత రఘురామ ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ను ఆయన దక్కించుకున్నారు. ఉండి టికెట్ పై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించుతూ చంద్రబాబు చేతుల మీదుగా రఘురామ బీ ఫారమ్ అందుకున్నారు. ఉండి టికెట్ మొదట దక్కించుకున్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు.
“ఇవాళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేతుల మీదుగా ఉండి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బీ ఫారం అందుకున్నాను. నన్ను ఎల్లప్పుడూ ఆదరించి, ఆశీర్వదిస్తున్న ఉండి ప్రజల వెన్నంటి నిలిచి, ఉండి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడతానని ఈ సందర్భంగా ఉండి ప్రజానీకానికి మాటిస్తున్నాను
(ఏప్రిల్ 22) సోమవారం ఉదయం 10 గంటలకు పెద అమిరంలోని తన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఉండి ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ వేస్తాను’’ అని రఘురామ ట్వీట్ చేశారు.
ఇక, తన తండ్రి చేతుల మీదుగా బీ ఫారమ్ అందుకున్న నారా లోకేశ్ ఆయనకు పాదాభివందనం చేశారు. బీ ఫారాల కోసం టీడీపీ అభ్యర్థులంతా చంద్రబాబు నివాసానికి రావడంతో ఆ ప్రాంతమంతా పసుపుమయమైంది. కాగా, అభ్యర్థుల జాబితాలో టీడీపీ స్వల్ప మార్పులు చేసింది. ఉండి సహా 5 చోట్ల అభ్యర్థులను మార్చారు చంద్రబాబు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి నియోజకవర్గాలలో కొత్త అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి, మడకశిర నుంచి ఎంఎస్ రాజు, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణ బరిలో దిగబోతున్నారు.