జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ పదే పదే వ్యక్తిగత విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పెళ్లిళ్లపై కామెంట్లు చేసిన జగన్ కు జనసేనాని పవన్ కల్యాణ్ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు.
“ఏం జగన్… నోరు ఎలా ఉంది? మీ అర్ధాంగి భారతి గారిని పెళ్లాం అంటే నచ్చుతుందా? జగన్ పెళ్లాం భారతి గారు అంటే నీకు కోపం రాదా? మా వ్యక్తిగత జీవితాల గురించి నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? నీకు బుద్ధుందా… ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వొక ముఖ్యమంత్రివేనా? అరే… ఎవరి వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉండవు? అందరి సంసారాలు బాగున్నాయా? కుటుంబాలు అన్నాక గొడవలు ఉండవా? భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే విడిపోతారు… నా జీవితంలోంచి వెళ్లిపోయిన ఆడబిడ్డల గురించి మాట్లాడుతూ ముగ్గురు పెళ్లాలు ముగ్గురు పెళ్లాలు అంటావు… మూర్ఖుడా…! దిగజారిపోయి మాట్లాడుతున్నావు… ఏం, ఒళ్లెలా ఉంది నీకు? భయపడతాం అనుకుంటున్నావా? జాగ్రత్తగా మాట్లాడు” అంటూ మునుపెన్నడూ లేని రీతిలో జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్యన జగన్ ఎక్కువ మాట్లాడుతున్నాడని, జగన్ టెన్త్, ఇంటర్ పేపర్లు లీక్ చేస్తున్న జమానాలో తాను చేగువేరా పుస్తకాలు చదివానని అన్నారు. జగన్ చిల్లర వ్యవహారాలు ఆపేయాలని, తన తెగింపు గురించి జగన్ అనుకునేదానికి పదింతలు ఎక్కువని ఆవేశంతో మాట్లాడారు.
“నేను బయటికి వస్తే ఆయనకు చెందిన చాలా కుక్కలు బయటికి వస్తాయి. వాళ్ల ధైర్యం ఏమిటంటే పవన్ కల్యాణ్ మా సామాజిక వర్గం వాడు కాబట్టి మేం ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారు. ఇలాంటి పిచ్చివాగుడు వాగితే తన్ని తగలేస్తాను ఒక్కొక్కడ్ని. మేము మేము కాపులం… మేము మేము డాష్ డాష్ అంటే… పట్టకారు పెట్టి నాలుక బయటికి లాగుతా. పోనీలే అని చాలాసార్లు వదిలేస్తుంటా… పిచ్చి మాటలు మాట్లాడకండి’’ అంటూ పేర్ని నాని వంటి వారికి పవన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఎన్డీయే కూటమికి ఏపీలో వెన్నుదన్నుగా నిలిచే స్థాయికి పవన్ ఎదగడం చిరంజీవి పుణ్యమేనని అన్నారు. చిరంజీవి వంటివారు ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరని సజ్జల అంటున్నారని, వారందరికీ డబ్బులు, అధికారం ఎక్కువైపోయాయని, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబుకు సూపర్ స్టార్ రజనీకాంత్ విషెస్ చెబితే ఆయన్ను కూడా తిడతారని, వైసీపీ పాలసీలు బాగున్నాయని చిరంజీవి గారు చెప్పినంతవరకు ఆయన మంచివాడని, జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చి, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండని పిలుపునివ్వగానే చెడ్డవారైపోయారని అన్నారు.
వైసీపీ నేతలు తమ ముఖాలు అద్దంలో చూసుకోవాలని, వారు సింహాలు కాదు గుంటనక్కల సమూహంఅని అన్నారు. బాబూ సజ్జల రామకృష్ణారెడ్డీ… నా సంగతి నీకు తెలియదు అంటూ సజ్జలకు పవన్ ఇచ్చిపడేశారు. జగన్ పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని తిరిగి బాగు చేసుకోవడానికే బీజేపీ, టీడీపీతో కలిసి కూటమి ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు… ఇదే జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి లక్ష్యం అని పవన్ స్పష్టం చేశారు.