ఇదేదో సినిమా డైలాగు కాదు.. పొలిటికల్ డైలాగే. అచ్చం ఊరమాసు డైలాగే.. అన్నది కూడా మాస్ నాయకుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఎవరిని ఊహించి అన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గురించే. రెండురోజుల కిందట రేవంత్ ప్రభుత్వం 100 రోజులు కూడా ఉండేలా కనిపించడం లేదని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే రేవంత్ రియాక్ట్ అయ్యారు. “ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు“ అంటూ కేసీఆర్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
తాజాగా పార్లమెంటు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెదక్ నియోజకవర్గం అభ్యర్థి, కాంగ్రెస్ నేత.. నీలం మధు శనివారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్పై నిప్పులు చెరిగారు. “కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్టలదొర కేసీఆర్ అంటుండు. అదేమైనా నువు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు.. చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు“ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే సత్తా.. దమ్ము ఎవరికీ లేదన్న రేవంత్.. ఇలా చేస్తే.. ఉరికించి కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పరిస్థితే ఇప్పుడు బాగోలేదన్న సీఎం రేవంత్.. కారుపని అయిపోయిందని.. షెడ్డుకు పోయిందని.. ఇక, బయటకు రాదని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం మరో పదేళ్లపాటు అధికారంలో ఉంటుందని చెప్పారు. గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీని గెలిపించారని.. అప్పట్లో మెదక్ నియోజకవర్గాన్ని ఇందిరమ్మ అభివృధ్ధి చేశారని చెప్పారు. పదేళ్ల బీఆరెఎస్ పాలనలో మెదక్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా గత డిసెంబరులో తాను సీఎం అయ్యాక చేపట్టిన కార్యక్రమాలను రేవంత్ వివరించారు.