టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు ఈరోజు. పుట్టిన రోజు పండగే అందరికీ అయినా.. కొందరి విష యంలో సమాజానికి పండుగ.. వ్యవస్థలకు పండుగ. ఇలాంటివారిలో దార్శనికుడు.. చంద్రబాబు. విజన్ ఉన్న నాయకుడిగా ఆయన పొందిన పేరు అనన్య సామాన్యం. నేటి తరానికి మేలు చేయడం మంచిదే అయినా.. వచ్చే తరాలకు భద్రత కల్పించడం బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చడంలో చంద్రబాబు జీవితం పూర్తిగా సక్సెస్ అయింది.
“నాకు ఏదో సంపాయించాలని లేదు. కానీ, ఏదో చేయాలని మాత్రం ఉంది. అది నా కుటుంబానికి కాదు. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు“ అని తపించే చంద్రబాబు.. రోజుకు 18 గంటల పాటు కష్టపడతారనడం లో సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు చంద్రబాబు ఒక ఐకాన్. ఆయన దూర దృష్టి, పాలనా చైతన్యం.. వంటివి నేడు కొందరికే అర్ధం కావొచ్చు.. కానీ, ముందు తరాలకు పూర్తిగా అర్ధమవుతుందని ఒకప్పుడు అమర్త్య సేన్ వంటి వారు కీర్తించడం ప్రస్తావనార్హం.
రాజకీయాలు కొంత వరకే.. అన్నట్టుగా చంద్రబాబు కూడా ఈ సూత్రాన్ని పాటించారు. పాలనపరంగా చూ సుకుంటే.. ఉమ్మడి ఏపీలో సైబరాబాద్వంటి సంచలన నగరాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత.. విభజిత రాష్ట్రంలో అమరావతికి బీజం వేశారు. ఆయన ప్రవచిస్తున్న ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. మరో 25 ఏళ్ల తర్వాత.. అమరావతి ఫలాలు.. అందుతాయనడంలో సందేహం లేదు. కానీ, మారిన పరిస్థితి.. ఈ ప్రాజెక్టు కు అడ్డంకిగా మారింది. ఇక, రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన నాయకుడు.
అందుకే.. ఇన్ని సంవత్సరాల్లో.. ఎన్ని తుఫానుల వంటి సవాళ్లు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు. పార్టీని నడిపించారు. ఏప్రిల్ 20, 1950వ సంవత్సరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఖర్జుర నాయుడు, తల్లి అమ్మణ్ణమ్మ. అప్పటివరకు రాజకీయ వాసనలే ఎరుగని ఈ కుటుంబంలో చంద్రబాబు రాక.. రాజకీయంగా మలుపు తిప్పింది. తొలుత కాంగ్రెస్.. తర్వాత.. టీడీపీలో ఆయన ప్రభంజనం.. నేటికీ దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. నేడు(శనివారం) 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న చంద్రబాబుకు.. తెలుగు ప్రజల నుంచి శుభాకాంక్షల వెల్లువ వరదలా పారుతోందనడంలో అతిశయోక్తి లేదు.