ఏపీ సీఎం జగన్ పై గులక రాయి దాడి ఘటనపై చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇది వైసీపీ స్క్రిప్ట్ ప్రకారం జరిగిన దాడి అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుండగా వైసీపీ నేతలు ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ దంపతులపై మాజీ మంత్రి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కంటికి రాయి దెబ్బ తగిలితే రాయి చూపరా అని ఆయన ప్రశ్నించారు. జగన్, భారతీలకు వివేకా హత్యకు సంబంధించిన అన్ని విషయాలు ముందే తెలుసని షాకింగ్ ఆరోపణలు చేశారు. సీబీఐ దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయని, అప్పట్లో ప్రతిరోజూ తనను ఇబ్బంది పెట్టారని అన్నారు.
వివేకా కేసులో తనకు సంబంధించి ఒక్క పాయింట్ ఉన్నా.. తన పాత్ర ఉన్నా బహిరంగంగా ఉరి తీయాలని సవాల్ విసిరారు. కోడికత్తి కేసు కూడా తన మీద పెట్టాలని చూశారని ఫైర్ అయ్యారు. వైసీపీ అభ్యర్థి సుధీర్ చిత్తుచిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ కన్నా దొంగ కోళ్లు పట్టుకునే బీమన్న మేలు అని సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకుంటే చెప్పు తెగుతుందని వార్నింగ్ ఇచ్చారు.