టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వందల మంది జనాన్ని మందలుగా వేసుకొని వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత జోగి రమేష్…నోరు తెరిస్తే చాలు బూతులు తప్ప మరేమీ మాట్లాడకుండా చంద్రబాబు, లోకేష్ లపై అవాస్తవాల విషం చిమ్మే బూతుల నేత కొడాలి నాని…టీడీపీ పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగి చివరికి కన్నతల్లి వంటి నారా భువనేశ్వరిపై పరుష పదజాలంతో విమర్శలు చేసి, గన్నవరం టీడీపీ ఆఫీసు దగ్గర విధ్వంసం సృష్టించిన వల్లభనేని వంశీ…ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్న నేతల గురించి ఏపీలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ, పైన చెప్పిన నేతలంతా జగన్ దృష్టిలో సౌమ్యులు, మంచివారు, ప్రజలకు మంచి చేసేవారు, జగన్ కు స్నేహితులు.
గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో అభ్యర్థుల్ని పరిచయం చేసే క్రమంలో వారి గురించి జగన్ చెప్పిన గొప్పల గురించి వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఈ నేతలను సౌమ్యులుగా.. సుద్దపూసలుగా.. వర్ణిస్తూ జగన్ ప్రశంసల వర్షాన్ని కురిపించడం విడ్డూరంగా ఉంది. నోరు తెరిచినంతనే తిట్ల వర్షంతో పాటు.. బూతుల్ని అలవోకగా పలికే నానీ.. జోగీ.. వంశీ.. కిట్టూ (కొడాలి నాని, మంత్రి జోగి రమేశ్.. వల్లభనేని వంశీ.. అవనిగడ్డ అభ్యర్థి రమేశ్.. పేర్ని కిట్టు అదేనండి పేర్ని నాని వారి అబ్బాయి) అందరూ మంచోళ్లుగా.. సౌమ్యులుగా సీఎం అభివర్ణించటం విశేషం. సీఎం జగన్ మాటలు ఇంత తియ్యగా ఉంటాయా? అన్న భావన కలుగక మానదు.
మంత్రి జోగి గురించి సీఎం జగన్ చెబుతూ.. ‘‘పెనమలూరు నుంచి జోగి నిలబడుతున్నాడు. జోగి నాకు మంచి స్నేహితుడు. మంచివాడు. సౌమ్యుడు. మీ అందరి దీవెనలు.. ఆశీస్సులు జోగిపై ఉంచాలని కోరుతున్నా’’ అంటూ చెప్పుకొచ్చారు. జోగి అండ్ కో ఎలాంటి వారు? ఏమేం చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘‘గుడివాడలో కొడాలి నాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితుడు. మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తాను’’ అని వ్యాఖ్యానించారు. మరో కీలక నేతగా.. తాను మాట్లాడే పది మాటల్లో అత్యధికంగా తిట్లను వాడే ప్రముఖుడిగా వల్లభనేని వంశీకి పేరుంది.
అలాంటి వంశీని ఉద్దేశించి తాజాగా జరిగిన ప్రచారంలో సీఎం జగన్ చెప్పిందేమంటే.. ‘‘మీ అందరికీ తెలిసిన వ్యక్తి. మంచివాడు. సౌమ్యుడు. నాకు మంచి స్నేహితుడు. మీ చల్లని దీవెనలు.. ఆశీస్సులు గన్నవరం అభ్యర్థి వంశీ మీద పెట్టాలి’’ అంటూ ప్రజలకు పరిచయం చేయటం గమనార్హం. అవనిగడ్డఅభ్యర్థిగా ఉన్న రమేశ్ ను సైతం మంచివాడిగా.. సౌమ్యుడిగా సీఎం జగన్ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీదా.. విపక్ష నేత చంద్రబాబు మీద తరచూ ఒంటి కాలి మీద విరుచుకుపడే అలవాటున్న మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు సైతం దూకుడుగా వ్యవహరిస్తారన్న పేరుంది.
అలాంటి కిట్టును ఉద్దేశించి.. ‘మచిలీపట్నం నుంచి యువకుడు.. ఉత్సాహవంతుడు పేర్నికిట్టు నిలబడుతున్నారు. నాకు మంచి స్నేహితుడు. కిట్టు మంచి చేస్తాడనే నమ్మకం నాకుంది’’ అంటూ ఆయనకు సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇలా, ఈ ఫైర్ బ్రాండ్, బూతుల నేలంతదరూ నా ఫ్రెండ్స్, మంచోళ్లు అంటూ జగన్ స్టాంప్ వేయడంతో ఆయనపై ట్రోలింగ్ జరుగుతోంది.