ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య వ్యవహారం ప్రస్తుత ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గత 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ దారుణ ఘటన.. ఐదేళ్ల తర్వాత.. వచ్చిన ఎన్నికల్లో తీవ్రప్రభావం చూపుతుండడం గమనార్హం. వివేకాకుమార్తె.. డాక్టర్ నర్రెడ్డి సునీత.. తన తండ్రికి జరిగిన అన్యాయంపై ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇదేసమయంలో బహిరంగ వేదికలపై చర్చలు పెడుతున్నారు.
గత రెండు నెలలుగా ఆమె 5 సార్లు ఈ విషయంపై ప్రత్యక్షంగా మీడియాముందుకు వచ్చారు. జాతీయ స్థాయిలో ఈ విషయాన్ని చర్చకు పెట్టారు. ఇక ఆ తర్వాత రాష్ట్రాల్లోనూ పర్యటిస్తూ.. ప్రకటనలు చేస్తున్నా రు. హైదరాబాద్ వేదికగా కూడా.. ఆమె నిప్పులు చెరుగుతున్నారు. వివేకా హత్యలో తమకు న్యాయం జరగలేదని.. నిందితుడుని సీఎం జగన్ కాపాడుతున్నారనేది సునీత ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. ఈ కేసులోఏ8గా ఉన్న వ్యక్తికే మరోసారి ఎంపీటికెట్ ఇచ్చారన్నది సునీత ప్రధాన ఆరోపణ.
ఈ క్రమంలో అధికారం నుంచి జగన్‌ను దింపేయాలని సునీత రాష్ట్ర ప్రజలకు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఇక, ఈ క్రమంలో సునీత రాబోయే 20 రోజుల్లో మరిన్ని వ్యూహాలకు తెరదీసినట్టు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా.. వివేకా హత్యను వివరించిన సునీత.. అనంతరం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ప్రతిప్రాంతానికీ చేరాలంటే.. ఏపీలోనే ఈ ఘటనను సమగ్రంగా వివరిస్తామని పేర్కొన్నారు.
విజయవాడ, విశాఖ, తిరుపతి, కడపలో కూడా వచ్చే రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ట్టు సునీత వెల్లడించారు. తద్వారా.. క్షేత్రస్థాయిలో అందరికీ ఈ కేసుపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఇక, తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సైతం కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు.
ఏతా వాతా ఎలా చూసుకున్నా.. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీని సునీత టార్గెట్ చేశారు. అయితే.. దీనిని కుటుంబ రగడగా చూపించే ప్రయత్నంలో వైసీపీ ఉంది. అయితే.. సునీత దూకుడు ముందు వైసీపీ తేలిపోతున్న దరిమిలా.. మున్ముందు మరిన్ని వ్యూహాలు అమలు చేయనున్న నేపథ్యంలో వైసీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంటుందనే చర్చ అయితే.. సాగుతోంది.