“2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఇచ్చిన హామీలు సూపర్. అవి ఎక్కడు న్నాయయ్యా? ఎక్కడ అమలయ్యాయయ్యా అంటే.. బారు షాపుల్లో వైన్ దుకాణాల్లో. జగన్ ఇచ్చిన హామీ లు చూడాలంటే.. మీ ఇంటి పక్కనే ఉన్న వైన్ దుకాణంలో చూడండి. స్పెషల్ స్టేటస్, బూంబూం.. పేర్లతో హామీలు కనిపిస్తాయి. ఇదీ జగన్ గారి పరిపాలన“- అని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దుమ్ము దులిపేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు ఎస్సీ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా స్తానిక ఎమ్మెల్యే, ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కోనేటి ఆదిమూలంపై విమర్శ లు గుప్పించారు. తండ్రీ కుమారులు వసూల్ రాజాలని విమర్శించారు. ఒకరు రియల్ ఎస్టేట్ ఇసుక వ్యాపారం చేస్తే.. మరొకరు.. ఇతర వ్యాపారాలు చేసుకుని బాగా సొమ్ములు పోగేసుకున్నారని చెప్పారు. వీరినా మీరు గెలిపించేది? అని ప్రజలను ప్రశ్నించారు. ఇక, సొంత అన్న జగన్ పాలనపై విమర్శలు చేస్తూ.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనని అన్నారు.
రాష్ట్రం ఏర్పడి.. పదేళ్లు అయినా.. ఇక్కడి ప్రజలు ఇంకా హైదరాబాద్,బెంగళూర్,చెన్నై వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఇక, హోదా కోసం 25 మంది ఎంపీలను అడిగిన జగన్.. 22 మంది ఎంపీలను గెలిపినా.. హోదా గురించి ఒక్క మాట కూడా అనలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని షర్మిల చెప్పారు. రాష్ట్రానికి తీసుకురావాల్సినవి తీసుకురాకపోగా.. వనరులు కూడా దోచేశారని, కొండలు కూడా తవ్వేశారని షర్మిల దుయ్యబట్టారు.
రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్ప చేశాడని జగన్పై విమర్శలు గుప్పించారు. “మొన్న మావాళ్లు చెబుతున్నారు. రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తే.. వెయ్యిరూపాయలు కూడా లేవట. ఇదీ.. మన జగనన్నగారి పాలన. అప్పులు చేసిన సొమ్మును మొత్తం పంచేశారా? అంటే.. సమాధానం చెప్పరు. మరి ఆ సొమ్ము ఏం చేశారు? అనేది ఆయన చెప్పాలి “ అని షర్మిల నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం, అవినీతి లేని పాలన కోసం వేయాలి. రాజన్న రాజ్యం కోసం వేయాలి“ అని షర్మిల చెప్పారు.