శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగింది. ఆయన ఎడమ కంటిపై నుదురుకు గాయమైంది. ఈ ఘటన ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై వివిధ రాష్ట్రాల నేతలు, ప్రధాని సహా జాతీయ స్థాయి నాయకులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావు ఉండకూడదు. ముఖ్యమంత్రిపై ఇలా దాడి చేయడాన్ని సహించకూడదు. కాబట్టి ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఒకప్పుడు బాబు అరెస్టుపై నోరు మెదపని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు జగన్‌పై దాడికి వెంటనే రియాక్షన్ ఇవ్వడం మాత్రం విమర్శలకు తావిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అరెస్టు చేసి జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఏ తప్పూ చేయకపోయినా బాబును అక్రమంగా అరెస్టు చేశారని అప్పుడు వివిధ జాతీయ పార్టీల నేతలూ స్పందించారు. వేర్వేరు రాష్ట్రాల నాయకులూ ఆ అరెస్టును ఖండించారు. కానీ బీఆర్ఎస్ అధినేత, అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కానీ కీలక నాయకులు కేటీఆర్, హరీష్ రావు కానీ బాబు అరెస్టుపై రియాక్టవ్వలేదు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాత్రమే మాట్లాడించారు. ఇక బాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులతో సహా వివిధ వర్గాల ప్రజలు ఆందోళన చేస్తుంటే కేటీఆర్ ఎగతాళిగా మాట్లాడరనే ఆరోపణలున్నాయి. ఏదైనా ఉంటే ఏపీకి వెళ్లి చేసుకోండని ఆయన అన్నారు.
ఇక ఇప్పుడమే జగన్‌పై ఇలా దాడి జరిగిందో లేదో వెంటనే హరీష్ రావు, కేటీఆర్ ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. జగనన్న జాగ్రత్త, క్షేమంగా ఉండండి, త్వరగా కోలుకోండి అంటూ ఆకాంక్షించారు. ఇలాంటి దాడిని ఖండించడం కరెక్టే. కానీ చంద్రబాబు విషయంలో ఒకలా.. జగన్ విషయంలో మరొకలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించడమే సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి.