సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. `నన్ను.. నా వయసును ప్రశ్నిస్తున్నాడు. ముసలో డు అంటున్నాడు. నా అనుభవం అంత లేదు నీ వయసు. నువ్వా నా వయసు గురించి మాట్లాడేది. ఏసీబస్సు కూడా దిగకుండానే.. ప్రజల మధ్య బస్సు యాత్ర చేస్తున్నాడు. ఈయనా నాగురించి మాట్లాడేది. ఖబడ్దార్.. మళ్లీ చెబుతున్నా.. రోజుకు 20 గంటలు పనిచేస్తా. నువ్వు రెండు గంటలు పనిచేసి 22 గంటలు ఏసీలో పడుకుంటావ్. ఇప్పుడు కూడా మండుటెండలో మూడు సభలు పెడుతున్నా. నువ్వు తిరగలవా? ` అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు సభల్లో(తాడికొండ, వేమూరు, ప్రత్తిపాడు) ప్రసంగించిన చంద్రబాబు తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వైఖరిని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఐటీ పరిచయం చేసింది తానేన్నారు. అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఐటీ తీసుకువస్తే.. దానిని కూడా తరిమేశాడని మండిప డ్డారు. విశాఖలో వచ్చిన పరిశ్రమలు ఒక్కటైనా ఉన్నాయా? అని నిలదీశారు. విజన్ ఉన్న నాయకుడిని కాబట్టే.. వచ్చే 20 ఏళ్లకు మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలనేది ఆలోచిస్తానని చెప్పారు.
జగన్ కు కూడా ఒక విజన్ ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హత్యలు చేయించడం.. హత్యలు చేసిన వారితో భుజాలు భుజాలురాసుకుని తిరగడం, తరతరాలకు తరగని విధంగా ప్రజలను, వనరులను దోచుకోవడం అనే విజన్ ఆయనకు కూడా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏవిజన్ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. ఓట్ల కోసం.. అధికారంకోసం ఎలాంటి గడ్డయినా తినేందుకు రెడీగా ఉన్నాడని విమర్శించారు. గత ఎన్నికల్లో ముద్దులు పెట్టి.. ఒక్క ఛాన్స్ అంటూ.. బ్రతిమాలి గద్దెనెక్కాక.. ప్రజలపై పిడిగుద్దులు కురిపిస్తున్నాడని మండిపడ్డారు.
`ఈ వయసు నాకు లెక్కకాదు. రోజుకు 20 గంటలు పనిచేస్తున్నా. రోజుకు మూడు సభల్లో ప్రసంగిస్తున్నా. ఎక్కడైనా నాముఖంలో నీరసం కనిపించిందా? ఎక్కడైనా అలసట కనిపించిందా? కానీ, ఈ ముఖ్యమంత్రి మాత్రం పట్టుమని పది నిమిషాలు బస్సును వదిలి బయటకు రాలేడు. 16లో ఏసీ పెట్టుకుని అధికారం కోసం పగటి కలలు కంటున్నాడు. ఆ కలలను మీ ఓటుతో ఛిద్రం చేయండి. ఇలాంటి సోమరిపోతులను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాం` అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.