ఔను.. ఇప్పుడు ఈ మాటే వైఎస్ అనుచరుల్లోనూ.. కరడుగట్టిన అభిమానుల్లోనూ వినిపిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి.. బతికిపోయారా?! అని వారు భావిస్తున్నారు. దీనికి కారణం.. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యపై జరుగుతున్న అత్యంత దారుణ క్రీడే కావడం గమనార్హం. దీనిని కుటుంబ కలహాలుగా(వివేకాకు రెండో వివాహం జరిగిందని.. ఆస్తుల పంపకాల వివాదలు ఉన్నాయని_ చిత్రించే ప్రయత్నం జరగడం ఒకవైపు.. కాదు.. హత్యలు చేసిన వారు అయినవారేనని మరోవైపు జరుగుతున్న తీవ్ర వివాదం.. రాష్ట్రంలో రావణకాష్టంగా మారింది.
కీలకమైన నాయకుడిగా.. వివేకం సార్‌గా పులివెందుల ప్రజలకు.. సుపరిచితుడైన వివేకానందరెడ్డి.. హత్య కు గురై ఐదేళ్లు గడిచిపోయాయి. అయితే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆయన సోదరుడి కుమారు డు. పైగా ఒకే ఇంటి పేరుతోనూ ఉన్నారు. అయినా.. వీసమెత్తు విచారణ ముందుకు సాగలేదు. మరోవైపు… న్యాయం కోసం అర్ధిస్తూ.. వివేకం కుమార్తె సునీత రోడ్డునపడ్డారు. రూ.కోట్లు అప్పులు చేసి.. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయ దేవత తప్ప.. ఏ దేవతా తమకు అండగా లేదని నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.
ఇక, వైఎస్ కుమార్తె షర్మిల కూడా.. న్యాయం కోసం అన్న ప్రభుత్వాన్ని అర్ధించి ఓడిపోయారు. ఈ క్రమం లో ప్రజల్లోనే గెలిచేందుకు సిద్ధపడ్డారు. మరోవైపు.. వీరి ప్రయత్నాలకు గండి కొడుతూ.. దీనిని తక్కువ చేసి చూపించేందుకు.. మరోవైపు ఎదురు దాడి చేసేందుకు వైఎస్ కుటుంబంలోనే చీలికలు వచ్చాయి. ఎటూ చెప్పలేని పరిస్థితి రావడంతో వైఎస్ విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. కళ్లు ఒత్తుకున్నారో.. నోరు కుట్టేసుకున్నారో.. మొత్తానికి చెవులు మూసుకుని.. అగ్రరాజ్యంలోనే రెండు మాసాలు వేసవి విడిది కోసం వెళ్లిపోయారు.
ఇలాంటి పరిస్థితిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉన్నా.. ఏమీ చేయలేని ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అందుకే.. ఆయన చనిపోయి.. బతికిపోయారని.. లేకపోతే.. ఈ `ఘోరం` చూడలేక.. దినదినం ఆయన చనిపోయి ఉండేవారని అంటున్నారు ఆయన అనుచరులు. ఇదే విషయాన్ని ఆయన మిత్రుడు, కడపకే చెందిన తులసిరెడ్డి సైతం ఆఫ్‌దిరికార్డుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇలానే ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం ప్రజాక్షేత్రానికి చేరింది. మరి ప్రజలు ఎటు నిలబడతారనేది చూడాలి. అప్పుడైనా వివేకా ఆత్మ శాంతిస్తుందేమో తెలియాల్సి ఉంది.
ఆడపిల్లలిద్దరు కలిసి అవినాష్ జీవితం నాశనం చేస్తున్నారు : YS Vimala Reddy – TV9#ysvimalareddy #sharmila #sunitha #tv9telugu pic.twitter.com/5QsjT8Iyn4
— TV9 Telugu (@TV9Telugu) April 13, 2024