తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది. జనవరి 1 ను అంగరంగ వైభవంగా జరుపుకునే వేళ.. ఉగాదిని కూడా అంతే సంబరంగా చేసుకోవాలన్న ధోరణి ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఉగాది అన్నంతనే గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ుగాది రోజున పొద్దుపొద్దున్నే మరేం తినకుండా మొదట ఉగాది పచ్చడిని రుచి చూడటం.. నాలుక మీద పచ్చడి పడినంతనే ఏ రుచి అయితే మెదడుకు తడుతుందో.. ఆ రుచికి తగ్గట్లే ఆ ఏడాది సాగుతుందన్న చిన్నపాటి నమ్మకం ఉంది. అందులో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. ఆరు రకాల రుచుల సమ్మిళతమైన ఉగాది పచ్చడిలోనూ సైన్స్ దాగి ఉంది.
తీపి.. చేదు.. వగరు.. పులుపు.. కారం.. ఉప్పు ఇలా ఆరు రకాల రుచులతో జీవిత సారాన్ని చెప్పకనే చెప్పేస్తుంది ఉగాది పచ్చడి. దీన్ని దేవుడికి నైవైధ్యంగా పెట్టి తర్వాత ఆరగించటం తెలిసిందే. ఉగాది పచ్చడి తిన్న తర్వాతే ఇంకేమైనా తినేది. ఉగాది పర్వదినం వసంత కాలంలో వస్తుంది. వసంతం తర్వాత గ్రీష్మ రుతువు రావటం తెలిసిందే. అంతే ఎండలు మండే కాలం. ఉగాది పచ్చడిని తీసుకోవటం ద్వారా రాబోయే ఎండలకు శరీరాన్ని సంసిద్ధం చేయటం ఉగాది పచ్చడి గొప్పతనం.
ఉగాదికి చేసే పచ్చడికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఆరు రుచులు నిజజీవితంలో ఎదుర్కొనే సమస్యలు.. కష్టాలు.. సుఖాలు.. దు:ఖాలు.. లాభాలు.. సంతోషాల్ని తెలుపుతుంది. తీపి సంతోషాన్ని.. చేదు బాధను.. కారం దు:ఖాన్ని సూచిస్తాయి. పచ్చని కొమ్మలతో వేప పూతలు.. మామిడి పిందెలతో ఉగాది పర్వదినం కన్నుల పండువగా ఉంటుంది. ఉగాది రోజున కొత్తగా వచ్చే మామిడికాయలతో.. వేప చిగురుతో.. కొత్త బెల్లం.. చింతపండు.. కొత్త కారంతో తయారు చేసే ఉగాది పచ్చడి శాస్త్రీయత చూస్తే.. మన పూర్వీకుల తెలివిని అభినందించకుండా ఉండలేం.