ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉగాది పండుగ రోజు ఏమా త్రం ఆమెకు తీపి కబురు లేకుండా అంతా చేదుగానే గడిచిపోయింది. నేటితో ముగిసిన కవిత రిమాండ్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 23 వ తేదీ వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత.. వాస్తవానికి తన కుమారుడుకి పరీక్షలు ఉన్నాయని.. బెయిల్ ఇవ్వాలని కోరుతు కోర్టును అభ్యర్థించారు.
అయితే.. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఈడీ ఆసక్తికర వాదనలు వినిపించింది. కవిత చెబుతున్న రీజన్‌ను చిన్నపిల్లలు స్కూల్ ఎగ్గొట్టేందుకు చెబుతున్న రీజన్‌గా పేర్కొన్నారు. దీంతో కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఏటా తెలంగాణలో ఉండి ధూంధాంగా చేసుకునే ఉగాది పండగ పూట కవిత .. తీహార్ జైలుకే పరిమితమయ్యారు. పైగా ఇదే రోజు ఆమెకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం ఉన్న జ్యుడీషియల్ రిమాండ్‌ను కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో కవిత జైలుకే పరిమితమయ్యారు.
సుదీర్ఘ లేఖ
తీహార్ జైల్లో ఉన్న కవిత.. న్యాయమూర్తికి సుదీర్ఘ లేఖ రాశారు. స్వదస్తూరితో రూల్పేపర్పైనే ఆమె రాసిన లేఖలో తనను అక్రమంగా అరెస్టు చేశారనే వాదనను వినిపించారు. రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐలు కక్ష తీర్చుకుంటున్నాయని ఆమె పేర్కొన్నారు. తనపై మోపింది.. తప్పుడు కేసేనని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా.. ఈడీ, సీబీఐ ఈ కేసును విచారణ పేరుతో సాగతీస్తున్నాయని మహిళా న్యాయమూర్తికి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. “ఎలాంటి ఆధారం లేకుండా ఈ కేసులో నన్ను ఇరికించారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు చెబుతున్నట్టుగా నా ప్రమేయం కానీ.. నాకు లబ్ధి కానీ ఈ కేసులో ఏమాత్రం లేదు“ అని కవిత రాశారు.
“మేడమ్ జస్టిస్, నా వ్యక్తిగత ఫోన్ నెంబరును కూడామీడియాలో ప్రచారం చేశారు. ఇది వ్యక్తిగత గోప్యతా హక్కుకు భంగమే కదా.“ అని పేర్కొన్నారు. నాకు న్యాయం కావాలి.. అని న్యాయమూర్తిని కోరారు.