తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాల దహనం వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. ఈ క్రమంలో సీఐడీ అదనపు ఎస్పీకి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సెక్రటరీ ఉమాకాంత్ బారిక్ లేఖ రాశారు. తమ సంస్థకు చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్ బుక్స్ ను సీఐడీ అధికారులకు ఇచ్చామని, అవి చాలా కీలకమైనవని స్పష్టం చేశారు. సీఐడీకి సహకరిస్తామని కాకుండా, కానీ డాక్యుమెంట్ల భద్రత కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని పేర్కొన్నారు.
సీఐడీ అధీనంలో ఉన్న పత్రాల భద్రతను ప్రశ్నార్థకం చేసేలా, దీనిపై తమకు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని సీఐడీకి విజ్ఞప్తి చేశారు.
పత్రాల దహనంపై సీఐడీ వివరణ ఇచ్చింది. ఫొటో కాపీ యంత్రం వేడెక్కడంతో కొన్ని పేపర్లు ఇరుక్కుపోయి, సరిగా ప్రింట్ కాలేదని, ఆ పత్రాలను దహనం చేస్తామని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఆయా కేసులకు సంబంధించి ఆధారాలన్నీ ఇప్పటికే కోర్టుకు సమర్పించామని ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అయితే, పత్రాల దహనంపై సిఐడి అధికారులు ఇచ్చిన వివరణ పై టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. “నేర పరిశోధనపై దృష్టిసారించాల్సిన సీఐడి…జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా రూపాంతరం చెందారు.
మా కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగులబెడుతున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్ లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశచరిత్రలో ఇదే ప్రథమం. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు” అని లోకేష్ హెచ్చరించారు.
ఇక, ఈ విషయంపై టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి స్పందించారు. కేవలం హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలు జిరాక్స్ తీసే సమయంలోనే మిషన్ చెడిపోయిందా అని ఆయన ప్రశ్నించారు. ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు సిఐడి తప్పుల మీద తప్పులు చేస్తోందని, టిడిపిపై పెట్టిన తప్పుడు కేసుల ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. సీఐడీ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతోనే ఆ పేపర్లు తగలబెట్టించారని, ఈ ఘటనపై విచారణ జరపాలని ఈసీని కోరామని చెప్పారు. సీఐడీ చీఫ్ రఘురామరెడ్డి నిస్సిగ్గుగా ఇచ్చిన వివరణ కాపీ రాష్ట్ర ప్రజానీకాన్ని నివ్వెర పరిచిందని అన్నారు. జగన్ కళ్లల్లో ఆనందం చూడటానికి సీఐడీ చీఫ్ అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు.