జగన్ తీరు నచ్చక టీడీపీలోకి వెళ్లిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫేక్ ప్రచారంలో చిక్కుకున్నారు. ఆయన తిరిగి వైసీపీలోకి వస్తున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో వేమిరెడ్డిపై ఉన్న నమ్మకాన్ని పొగొట్టేందుకే వైసీపీ ఈ ప్రచారం నిర్వహిస్తుందని వేమిరెడ్డి కుండబద్ధలు కొట్టారు. ఏం చేసినా వైసీపీని ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు.
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి టికెట్ దక్కినప్పటికీ.. సీఎం జగన్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లారు. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇక ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ నుంచే కోవూరు ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు. అయితే సుదీర్ఘకాలం వైసీపీలో ఉన్న ఈ దంపతులు తాజాగా టీడీపీలో ఇమడలేకపోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తిరిగి సొంతపార్టీ వైపే చూస్తున్నారనే ఊహాగానాలు వినిపించాయి. బాబుతో వీళ్లకు పొసగలేదనే రూమర్లూ వచ్చాయి. వేమిరెడ్డిని దెబ్బకొట్టేందుకే ఈ ఫేక్ ప్రచారం జరిగింది.
అందుకు వేమిరెడ్డి తాజా వ్యాఖ్యలే రుజువు. తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయనన్నారు. తమను దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా జరుగుతున్న ప్రచారమే ఇది అని పేర్కొన్నారు. రోజుకో పార్టీ మారుతూ చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నాయకులు ఈ ప్రచారం చేస్తున్నారని వేమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని టీడీపీ కార్యకర్తలకు, అనుచరులకు సూచించారు. టీడీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ తరపున తాము గెలవబోతున్నామని తెలిసి తట్టుకోలేక వైసీసీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.