ఢిల్లీ లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమారుడికి ప్లస్ వన్ పరీక్షలు ఉన్నాయని.. ఈ సమయంలో తల్లిగా అతడి పక్కన ఉండాల్సిన బాధ్యత తన మీద ఉందని అందుకే తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. దీనికి సంబంధించిన వాద ప్రతివాదనలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. తీర్పును రిజర్వు చేసిన నన్యాయమూర్తి ఈ రోజు (సోమవారం) వెల్లడిస్తామని చెప్పటం తెలిసిందే.
తాజాగా కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. మరిప్పుడు ఏం జరగనుంది? నిజానికి లిక్కర్ స్కాంలో అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్న కవిత.. మధ్యంతర బెయిల్ తో పాటు.. సాధారణ బెయిల్ పిటిషన్ ను కూడా దాఖలు చేశారు. ఒకవేళ మధ్యంతర బెయిల్ రాకుంటే సాధారణ బెయిల్ పిటిషన్ మీద ఈ నెల 20న జరగనుంది. అప్పటివరకు ఆమె బెయిల్ కోసం ఎదురుచూస్తూ ఉండాల్సిందే.
గత నెల 15న హైదరాబాద్ లో కవిత నివాసంలో అరెస్టు చేసిన ఈడీ.. అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించటం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చటం తెలిసిందే. తొలుత ఏడు రోజులు.. అనంతరం మూడు రోజుల పాటు కోర్టు అనుమతితో ఆమెను ఈడీ అదుపులోకి తీసుకొని విచారించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఆమెకు మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువన్న మాట వినిపిస్తోంది.
సాధారణ బెయిల్ పిటిషణ్ విచారణ ఏప్రిల్ 20న జరగనుంది. దీంతో కవిత జ్యూడిషియల్ రిమాండ్ ను పొడిగించే అవకాశాలే ఎక్కువంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన వారెవరు వెంటనే బెయిల్ పొందిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కవితకు కూడా అలాంటి పరిస్థితే ఉంటుందంటున్నారు. ఇదిలా ఉంటే కవితను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. దీంతో.. సీబీఐ విచారణకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని.. కనీసం ఆ పిటిషన్ కాపీ ఇవ్వలేదని.. అందుకే సీబీఐ విచారణకు రీకాల్ చేయాలని కోరుతూ శనివారమే పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి కోర్టు స్పందిస్తూ.. కవితను విచారించటానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేయాలో తెలియజేయాలని కోరుతూ సీబీఐను ఆదేశించారు. దీనికి సీబీఐ మూడు రోజుల సమయం కోరింది. దీంతో.. ఈ అంశంపై తదుపరి విచారణ ఈ నెల 10న చేపడతామని చెప్పింది. దీంతో ఇప్పుడు కవితకు సంబంధించి పలు అంశాలు ప్రశ్నలుగా మారాయి?
అవి..
– సీబీఐ విచారణకు కోర్టు అనుమతి ఇస్తుందా?
– సాధారణ బెయిల్ పిటిషన్ ఏం కానుంది?
ఒకటి తర్వాత ఒకటిగా తెర మీదకు వస్తున్న అంశాలతో కవిత అండ్ కో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఇంకొకటి ఉంది. ఈ రోజు (సోమవారం)నుంచి మొదలు మూడు రోజుల పాటు రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు సంబంధించిన కేసుల విచారణ జరగనుంది. దీంతో.. ఎప్పుడేం జరుగుతుందన్నది హాట్ టాపిక్ గా మారింది.