తన చిన్నాన్న వివేకాను హత్య చేయించిన ఎంపీ అవినాష్ రెడ్డి ని ఓడించేందుకే కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వివేకా హంతకులను కాపాడేందుకు జగనన్న ప్రయత్నిస్తున్నారని, వివేకా చిరకాల కోరిక ప్రకారమే తాను కడప ఎంపీగా పోటీ చేసి ఆయన హంతకుడు అవినాష్ ను ఓడిస్తానని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తొలిసారిగా వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు.
షర్మిల మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని, ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అవినాష్ రెడ్డి అన్నారు. మనిషిగా పుట్టాక కొంచెమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలని, కొంచెమైనా ఇంగితజ్ఞానంతో మాట్లాడాలని హితవు పలికారు. మసి పూస్తారు, బురద చల్లుతారు… వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు… వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా అంటూ షర్మిల వ్యాఖ్యలపై అవినాష్ స్పందించారు. ఆ వ్యాఖ్యల గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఎంత మాట్లాడుకోవాలంటే అంత మాట్లాడుకోవచ్చని, తనకెలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
కాగా, ఈ రోజు కూడా అవినాష్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మళ్లీ టిక్కెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో చెప్పాలని జగన్ ను డిమాండ్ చేశారు. నేరం చేయకపోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ధి చెప్పాలని కడప ప్రజలకు పిలుపునిచ్చారు.