అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ.. వైసీపీని ముందుండి నడిపిస్తారని సీఎం జగన్, వైసీపీ అధినేత పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నాయి. శుక్రవారం శ్రీకాకుళానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రిజైన్ చేసి.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన ఈమె దాదాపు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలోనూ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ షాక్ నుంచి వైసీపీ తేరుకోకముందే.. ఉరుములేని పిడుగు మాదిరిగా మైనారిటీ నాయకుడు, ఎమ్మెల్సీ అనంతపురం జిల్లాకు చెందిన కీలక నేత మహమ్మద్ ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన స్వదస్తూరితో కూడిన లేఖను సీఎం జగన్‌కు పంపించారు. కేవలం ఆర్టీకే కాకుండా పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తన్నట్లుగా ప్రకటించారు. శాసనమండలి చైర్మన్ కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మాజీ పోలీసు అధికారి అయిన మహ్మద్ ఇక్బాల్ గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు.
2019 ఎన్నికల తర్వాత ఇక్బాల్‌కు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. హిందూపురం ఇంచార్జ్ గా కొనసాగారు. నాలుగేళ్ల వరకూ పని చేసిన తర్వాత ఆయన స్థానంలో హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా నారాయణ దీపికను ప్రకటించారు. ఇక్బాల్ పేరును జగన్ కనీసం పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే.. ఆయన వల్ల పార్టీ ఇబ్బందులు పడిందనే చర్చ కూడా ఉంది. సొంత పార్టీ నేతలనే తనకు తెలిసిన పోలీసులతో అరెస్టు చేయించి.. స్టేషన్లలో పెట్టి కొట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో వైసీపీ అధినేత ఆయనను పక్కన పెట్టారు.
హిందూపురం నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీలో మూడు, నాలుగు వర్గాలు ఉంాయి. ఈ వర్గ పోరులో హత్యలు కూడా చోటు చేసుకోవడం వివాదాస్పదమయింది. కర్నూలుకు జిల్లాకు చెందిన ఇక్బాల్‌కు వ్యతిరేకంగా.. పార్టీ నేతలంతా జట్టు కట్టారు. ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఆద్వర్యంలో మాజీ ఎంఎల్ఏ అబ్దుల్ ఘనీ,కొండూరు వేణుగోపాల్ రెడ్డి లాంటి బలమైన నేతలంతా కలిసి స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్బాల్ ను తప్పించిన వైసీపీ హైకమాండ్ స్థానికురాలు కానప్పటికీ బీసీ మహిళ కోటాలో దీపికకు సీటు ఇచ్చారు.
ఇటీవలి కాలంలో ఇక్బాల్ కు పార్టీ కార్యక్రమాలకూ పిలుపు రావడం లేదు. పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన అవమానం ఫీలయ్యారు. తనకే టిక్కెట్ అని ఏడాది కిందటి వరకూ నమ్మించారని ఇప్పుడు అసలు అవమానించడం ఏమిటని ఆయన భావిస్తున్నారు. గతంలో తాను ఇంచార్జిగా ఉన్నప్పుడు వర్గ పోరాటాన్ని కంట్రోల్ చేసేలా.. హైకమాండ్ వ్యవహరించలేదని.. ఇప్పుడు పూర్తిగా అవమానిస్తున్నారని ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు.