తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో కొందరు దుండగులు రాళ్లు విసిరారు.
ఈ రాళ్ల దాడిలో ఒక మహిళ, మరో యువకుడు గాయపడ్డారు.
దీంతో చంద్రబాబు తన ప్రచార వాహనం నుంచి దిగి అక్కడే రోడ్డుపై బైఠాయించారు.
జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న తనలాంటివారిపైనే రాళ్లు విసిరితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
తన సభకు పోలీసులు సరైన రక్షణ కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు.
కాగా తిరుపతిలో తెదేపా సభపై రాళ్ల దాడిని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే రాళ్ల దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.
‘‘పోలీసులే దగ్గరుండి రాళ్ల దాడి చేయించారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉపఎన్నికలు జరగాలి. ఈసీ పరిధిలో జరిగే ఎన్నికల్లో ఇలాంటి ఘటన జరగడం దారుణం’’ అని అచ్చెన్న మండిపడ్డారు.