మాట్లాడటం తప్పు కాదు. కానీ.. మాట్లాడే మాటల్లో తప్పులు దొర్లకూడదు. ఎదుటోడ్ని వేలెత్తి చూపించే క్రమంలో మాట్లాడే మాటల కారణంగా.. అందరి వేళ్లు మనవైపు చూపేలా ఉంటే ఆ మాటలు ఎంత దిక్కుమాలిన మాటలో ఇట్టే అర్థమైపోతాయి. మాజీ మంత్రిగా కీలక శాఖల్ని నిర్వహించి కేసీఆర్ సర్కారులో అప్రకటిత ముఖ్యమంత్రిగా వ్యవహరించినట్లుగా విమర్శలు ఎదుర్కొన్న కేటీఆర్.. ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న వైనం.. పలు అంశాల మీద ఆయన స్పందనలు కేటీఆర్ ఇమేజ్ ను మాత్రమే కాదు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నట్లుగా చెబుతున్నారు.
ఆచితూచి అన్నట్లు మాట్లాడాల్సిన మాటల్ని ఎడాపెడా మాట్లాడేయటంలో అర్థం లేదన్న చిన్న విషయాన్ని కేటీఆర్ ఎలా మిస్ అవుతారని ప్రశ్నిస్తున్నారు. తాజా ప్రెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెబుతున్నారు. సున్నిత అంశాల్ని ప్రస్తావించే వేళలో.. తిరిగి వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా బలమైన వాదనను వినిపించాలి. ఈ విషయంలో కేటీఆర్ పదే పదే ఫెయిల్ అవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
తాజా ప్రెస్ మీట్ లో కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని యథాతధంగా చదివితే..
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ లీకువీరుడు. ఫోన్ ట్యాపింగ్‌లో వాళ్లున్నారు, వీళ్లున్నారంటూ లీకులిస్తున్నారు. లీకు వీరునికి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పే దమ్ము లేదు. నేరుగా ప్రజల ముందు ఆధారాలు బయటపెట్టే ధైర్యం లేదు. విచారణలో ఏముందో విషయం, ఎవరికీ తెలియదు. కానీ.. పోలీస్ రిమాండ్ ఉన్నవారి విషయాలు కూడా మీడియాకు లీకులు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా ట్యాపింగ్ జరిగి ఉంటే.. దానికి కేసీఆర్‌ను మాత్రమే బాధ్యుడిని చేస్తారా?
– అధికారంలో పార్టీలు మారినా.. అధికారులు మారలేదు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్నారు. మరి అందులో ఈ అధికారుల ప్రమేయం ఉండదా?
– హీరోయిన్లను నేను బెదిరించానని ఓ మంత్రి అంటున్నారు. ఆ మంత్రికి తలకాయ ఉందో లేదో తెలియదు. అటువంటి దిక్కుమాలిన పని చేయాల్సిన అవసరం నాకు లేదు.
– అడ్డదిడ్డమైన మాటలు, చెత్త ఆరోపణలు చేస్తే.. మంత్రి అయినా.. ముఖ్యమంత్రి అయినా వదలబోను. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని లీగల్‌గా తాట తీస్తాం.
– కాంగ్రెస్ ప్రభుత్వంలో 2011లో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీల ఫోన్లు ట్యాప్ చేశారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందేమో బయట పెట్టాలి. అప్పటి నుంచి ఏ కుంభకోణాలు జరిగాయో తేల్చాలి.
– బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నపుడు నా యాపిల్ ఫోన్ హ్యాక్ అయినట్లు సందేశం పంపారు. హామీలు నెరవేర్చలేక.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటివి మాట్లాడుతున్నారు. ఇలా ఎన్ని రోజులు గడుపుతారు?
– ఒక పార్టీ గుర్తుతో గెలిచి.. మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను మూడు నెలల్లోగా అనర్హులుగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల పదవి మూడు నెలల్లో ఊడిపోవడం గ్యారెంటీ. తొందర్లోనే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక రావడం తథ్యం.
– కాంగ్రె్‌సకు ఓట్లు వేయనందుకు హైదరాబాద్ నగరంపై రేవంత్‌రెడ్డి కక్షగట్టారు. అందుకే ప్రాజెక్టుల్లో నీళ్లున్నా తాగునీరు అందించడం లేదు. ట్యాంకర్ల ద్వారా నీటిని ఎందుకు సరఫరా చేయాల్సి వస్తోందో సీఎం చెప్పాలి. కేసీఆర్‌పై ఉన్న రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు.
– కాళేశ్వరంలో నీళ్లున్నా.. దాచిపెట్టడంతో లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. పంట పండితే బోనస్ ఇవ్వాలన్న భయంతోనే ఎండ బెట్టారు. రైతుల ఆత్మహత్యల వివరాలను సీఎంకు నేరుగా పంపిస్తాం. అన్ని వివరాలు మేమే ఇస్తే.. ముఖ్యమంత్రి ఎందుకు? ఆయన అధికార యంత్రాంగం ఎందుకు?
– రాముడికి మొక్కుదాం.. ఎన్నికల్లో బీజేపీని తొక్కుదాం. రాముడికి దండం పెడదాం.. మోదీకి ఓటేద్దామంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. రాముడికి దండం పెడదాం.. కానీ, మోదీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. రాష్ట్రానికి బీజేపీ ఏమి చేసిందో చెప్పగలరా? డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పిరం చేసిన మోదీ.. పిరమైన ప్రధాని.
– మోదీ హవా ఉందని చెప్పే బీజేపీ నాయకులు ఇతర పార్టీల్లో నుంచి అభ్యర్థులను ఎందుకు వెతుక్కుంటున్నారు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు లేరు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీతోనే పోటీ ఉంది.
– సీఎం రేవంత్ గుంపు మేస్త్రీ అయితే.. మోదీ తాపీ మేస్త్రీ. ఆ ఇద్దరూ కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ కు సమాధి కట్టాలని చూస్తున్నారు. పట్నం మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ద్రోహులు. విశ్వేశ్వర్‌రెడ్డి విశ్వాస ఘాతకుడు.