గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండలు విహారయాత్రకు వెళుతున్న రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునిగిపోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 77 మంది ప్రయాణికులతో బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు దేవీపట్నంలోని కచ్చలూరు వద్ద సుడిగుండంలో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం నుంచి 26 మంది సురక్షితంగా బయటపడగా 44 మృతదేహాలు వెలికితీశారు. ప్రమాదం జరిగిన నెలరోజుల తర్వాత ఆ బోటును ధర్మాడి సత్యం టీం వెలికితీసింది. ఆ ప్రమాదం తర్వాత గోదావరిలో పర్యాటక లాంచీలపై ఆంక్షలు విధించారు. ఆ తర్వాత కరోనా లాక్డౌన్ రావడంతో ఇప్పటివరకు ఆ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, మళ్లీ పాపికొండల ప్రయాణం ఎప్పుడని పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలోని పర్యాటకులకు టూరిజం వాఖ శుభవార్త చెప్పింది. పాపికొండల విహారయాత్రను ఏప్రిల్ 15 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపింది. తాజాగా, ఏపీ పర్యాటకశాఖ బోటుకు జలవనరుల శాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో పాపికొండల అందాలను పర్యాటకులు ఆస్వాదించే అవకాశం కలగనుంది.
ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి (కంపెనీ) నుంచి బోటు బయలుదేరుతుందని ఉభయగోదావరి జిల్లాల ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ (కాకినాడ) టీఎస్ వీరనారాయణ తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం త్వరలోనే ఆన్లైన్లో టికెట్లను ఉంచుతామన్నారు. అయితే, ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు అనుమతులివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు పర్యాటక రంగం, థియేటర్లు వంటి వాటిపై ఆంక్షలు విధిస్తున్నాయి.
అటువంటిది, ఆల్రెడీ ఆంక్షలు విధించిన పాపికొండల ప్రయాణానికి ఈ సమయంలో అనుమతులివ్వడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలోని ప్రముఖ విహార యాత్రా ప్రదేశాల్లో పాపికొండలు ఒకటి. పాపి కొండల నడుమ ప్రకృతి అందాలను తిలకిస్తూ బోటులో ప్రయాణం చేసేందుకు ఇరు తెలుగురాష్ట్రాల నుంచి ఎంతోమంది పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. పాపికొండల్లో నడిచే బోట్లపై ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా మరో 3 వేల మంది ఉపాధి పొందుతున్నారు.