పులివెందుల లోక్ సభ స్థానం నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల బరిలోకి దిగబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కడప సిట్టింగ్ ఎంపీ, తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు. కాంగ్రెస్ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలన్ని నిర్ణయం సులువైనది కాదని అన్నారు. అవినాష్ రెడ్డిపై పోటీ వల్ల తమ కుటుంబం నిలువునా చీలుతుందని తెలిసినా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.
“నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు. చిన్నాన్న వివేకాను చంపించిన వారిని జగనన్న వెనకేసుకొస్తున్నారు. తద్వారా హత్యా రాజకీయాలకు దన్నుగా నిలిచారు. చిన్నాన్న హంతకులను జగనన్న కాపాడుతున్నారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాశ్ కు టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయాను. అవినాశ్ ఓ హంతకుడు… కడపలో అతడు మళ్లీ గెలవకూడదనే నేను పోటీ చేస్తున్నా. హంతకుడు అవినాశ్ ను ఎంపీ కానివ్వకపోవడమే నా లక్ష్యం’’ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి.
గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయం చేసిందని ఆరోపించారు. తాను కడప ఎంపీగా నిలబడాలనేది చిన్నాన్న వివేకా కోరిక అని, ఆయన కోరిక మేరకే కడప ఎంపీ బరిలో దిగుతున్నానని అన్నారు. ప్రజలంతా తనను ఆశీర్వదించాలని కోరారు.