కారణం ఏమైనా కావొచ్చు.. ఒక నేరారోపణ మీద కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లటం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కాం వెంటాడుతోంది. ఇందులో ఆమె పాత్ర ఎంతన్న విషయం రానున్న రోజుల్లో మరింత స్పష్టం కానుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను టార్గెట్ చేసిన క్రమంలో.. కవితను పావులా వాడుకున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు వెనుక కవిత కారణమన్న మాట ఒక ఎత్తు అయితే..తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు మాత్రం.. కవిత అంత త్వరగా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. జైల్లో ఉన్న కవిత తనకు కావాల్సిన సదుపాయాల గురించి అడుగుతున్న వైనం ఇప్పుడు చర్చగా మారింది. రాజకీయ నేతలు.. అత్యున్నత స్థానాల్లో పదవుల్ని నిర్వహించిన వారెందరో జైలుకు వెళ్లటం.. ఆ సందర్భంగా కోరని డిమాండ్లను ఆమె కోరటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న జైల్లో ఆభరణాల్ని ధరించేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును కోరటం తెలిసిందే.
తాజాగా తనకు జపం చేసుకోవటానికి వీలుగా జపమాల కావాలన్న కవిత.. మెడిటేషన్ చేసుకోవటానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. రౌస్ అవెన్యూ కోర్టుకు తాజాగా పిటిషన్ దాఖలు చేసిన కవిత.. తనకు స్పోర్ట్స్ షూ.. పుస్తకాలు.. పెన్నులు.. పరుపు.. దుప్పట్లు కావాలనీ కోరటంతో పాటు ఇంటి భోజనాన్ని అనుమతించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి కవిత తరఫు న్యాయవాది నితేశ్ రాణా ప్రత్యేక కోర్టును కోరారు.
మార్చి 28న కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఏ ఒక్క వసతిని ఇప్పటివరకు జైలు అధికారులు అమలు చేయలేదన్న ఆయన.. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటిని తెచ్చుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే.. జైలు సూపరింటెండెంట్ మాత్రం కోర్టు ఉత్తర్వుల్లో ఉన్న అన్నింటిని అనుమతించినట్లుగా పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కవిత కోరినట్లుగా జపమాలతో సహా అన్ని వస్తువుల్ని అందేలా అనుమతించాలన్నారు. కొన్నింటిని స్వయంగా సమకూర్చుకునేందుకు అనుమతుల్ని జారీ చేసింది. గతంలో ఆమె కోరిన ఆభరణాలు ధరించేందుకు.. లేసులు లేని బూట్లను అనుమతించాలన్న ఆదేశాల్ని జారీ చేసింది.
జైల్లో ఉన్న వేళలో ప్రత్యేక వసతుల్ని కోరే విషయంలో.. కొన్నింటిని మినహాయిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రజాజీవితంలో ఉన్న వారిని టార్గెట్ చేసి ఖైదు చేయటం మామూలే. ఇలాంటి వేళల్లో జైల్లో ఉన్న వారిపై సానుభూతి వెల్లువెత్తటం సమజంగా చోటు చేసుకునే ప్రక్రియ. కానీ.. కవిత విషయంలో అలాంటిదేదీ జరగకపోవటానికి కారణం.. ఆమె కోరుతున్న వసతుల్లో చాలావరకు చాలామంది నిందితులు.. అనుమానితులు కోరకపోవటమేనని చెబుతున్నారు. నిజానికి ఈ అంశంలో కవిత మరింత జాగ్రత్తగా ఆలోచించటంతో పాటు.. ముఖ్యల నుంచి సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.