గత రెండు రోజులుగా ఏపీలో రాజకీయ రచ్చకు దారి తీసిన వలంటీర్ల వ్యవహారం.. పెను చర్చకు దారి తీసింది. నిన్న మొన్నటి వరకు వలంటీర్ల విషయంలో టీడీపీ సహా కూటమి పార్టీలు ఆచితూచి మాట్లాడా యి. కొన్నాళ్ల కిందట పెద్ద ఎత్తున విమర్శలు చేసినా.. వలంటీర్లకు-ప్రజలకు మధ్య ఏర్పడిన బంధం నేపథ్యంలో ఆయా పార్టీలు సర్దుకున్నాయి. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా వలంటీర్లను ఏకంగా పింఛ ను సహా ఇతర పథకాల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం దూరం పెట్టింది.
సహజంగానే ఇది రాజకీయ రగడకు దారి తీస్తుందని అందరూ ఊహించారు. ఇప్పుడు అదే జరిగింది. వలంటీర్లను ఉద్దేశ పూర్వకంగా తప్పించారని.. కాబట్టి.. ఈ పాపం టీడీపీదేనని, చంద్రబాబుదేనని వైసీపీ ఆరోపిస్తోంది. దీనినే క్షేత్రస్థాయిలో కూడా ప్రచారం చేస్తోంది. కట్ చేస్తే.. అసలు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉందని.. సచివాలయ సిబ్బంది రెండు లక్షల మంది ఉన్నారని, వారితో పింఛన్లు పంపిణీ చేయించ వచ్చని టీడీపీ వాదన వినిపిస్తోంది. ఇది రాజకీయంగా ఇరు పార్టీల మధ్య నిప్పులు చెరిగేలా చేస్తోంది.
అయితే.. దీనికి భిన్నమైన వాదన ప్రజల్లో వినిపిస్తోంది. టీడీపీపైనే మెజారిటీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు చెబుతున్నట్టు.. లేదా.. ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నట్టు.. సచివా లయ, లేదా.. ఇతర గ్రామస్థాయిలోని ఉద్యోగుల ద్వారా పింఛన్లు, పథకాలు పంపిణీ చేస్తే.. ఇక వలంటీర్ల వ్యవస్థ అవసరమే ఉండదు. ఎందుకంటే.. ఇప్పుడు ఈ మూడు మాసాలు(ఏప్రిల్-మే-జూన్) పంపిణీ చేసిన వారు.. భవిష్యత్తులోనూ పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.
అంటే.. మొత్తంగా చంద్రబాబు వేసిన ఈ ప్రణాళిక కూడా క్షేత్రస్థాయిలో బెడిసి కొడుతోంది. ఇది మొత్తంగా వలంటీర్లను తీసేసే ఉద్దేశంతోనే జరుగుతున్న చర్యగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఎలా చూసుకున్నా.. వలంటీర్ల వ్యవస్థ.. ఆ వ్యవస్థపై ఇప్పుడు జరుగుతున్న రచ్చ వంటివి సీఎం జగన్ ప్రశాం తంగా ఉండేందుకు పనిచేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. వారు వారు తన్నుకు ఛస్తారులే.. అన్నట్టుగా జగన్ ఉన్నారనేది వైసీపీ నేతల మాట. ఏదేమైనా ఒక సున్నితమైన అంశాన్ని కెలికేస్తే.. ఎలా ఉంటుందో… ఏపీ రాజకీయాలు చెబుతున్నాయనేది వాస్తవం.