వలంటీర్ల దూకుడు తెలుసు. ఉద్దేశపూర్వకంగా వారిని ప్రోత్సహించారని కూడా తెలుసు. పింఛన్ల పంపిణీ పేరిట.. ఓటర్లను వలంటీర్లతో బెదిరింపులకు గురి చేశారన్న విషయం దాచేస్తే దాగేది కాదు.. ఇన్ని తెలిసి నా.. ఇంత తప్పులు చేశామని తెలిసినా.. వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల విషయంలో చంద్రబాబుపై నెపం నెట్టేస్తోంది. ఇంకా ఏడుస్తూనే ఉంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో వైసీపీ వ్యూహానికి భారీ బ్రేకులు పడ్డాయి.
అయితే.. దీనికి చంద్రబాబే కారణమంటూ.. సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. వాలంటీర్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పూటకోమాట మార్చుతున్నారని ఆయన విమర్శించారు. పేదలకు మేలు చేసే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని పాత పాటే పాడారు సజ్జల. అందుకే చంద్రబాబు నేరుగా జోక్యం చేసుకోకుండా సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ సంస్థ ద్వారా పోరాటం చేయిస్తున్నారని మండిపడ్డారు.
సిటిజన్స్ ఫర్ డెమొక్రసీలో ఉండే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎవరో రాష్ట్రంలో అందరికీ తెలుసని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన విశ్వరూపం ప్రదర్శించారని, ఆయన టీడీపీ కార్యాలయం నుంచే ఆజ్ఞలు జారీ చేస్తున్నారా అనేంతగా మమేకం అయ్యారని ఆరోపించారు. పూర్తిస్థాయి టీడీపీ కార్యకర్తలా వ్యవహరించే నిమ్మగడ్డ, మరో ఇద్దరు ముగ్గురు కలిసి సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ స్థాపించారని సజ్జల వివరించారు.
వీళ్లు వాలంటీర్ వ్యవస్థపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని, కానీ కోట్లలో ఫీజులు వసూలు చేసే కపిల్ సిబాల్ వంటి న్యాయవాదిని రిటైరైన ఐఏఎస్ అధికారులు, రిటైరైన జడ్జిలు ఈ కేసుకు నియమించుకోవ డం చూస్తుంటే దీని వెనుక ఎవరున్నారో తెలుస్తుందని అన్నారు. వీళ్లకు ఇప్పటికిప్పుడు ప్రజాస్వామ్యం పై ప్రేమ పుట్టుకొచ్చిందని, వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడమే వీరి లక్ష్యమని సజ్జల ధ్వజమెత్తారు.
వాస్తవానికి గత నాలుగు మాసాల కిందటే రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు పర్యటించారు. అప్పట్లోనే వారు కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. వాటిని పాటించి ఉంటే.. ఇప్పుడు ఈ తిప్పలు వచ్చి ఉండేవి కాదు కదా! అంటున్నారు పరిశీలకులు. ఆడలేక.. మద్దెల ఓడు అన్నట్టుగా సజ్జల ఇప్పుడు చంద్రబాబుపై పడి ఏడవడం ఎందుకు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.