టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ అభ్యర్థులు.. కూనీ కోర్టు, స్మగ్లర్లు, దోపిడీ దారులు. వీరందరినీ జగన్ తన చెంతన చేర్చుకున్నాడు. ఒక విద్యార్థి.. మరో విద్యార్థిని చేరతీస్తాడు. ఒక దొంగ మరో దొంగను చేరదీస్తాడు. ఒక హంతకుడు మరో హంతకుడికి అవకాశం ఇస్తాడు. అలానే.. ఈ జగన్.. కూనికోర్లు, దోపిడీదార్లు, స్మగ్లర్లను చేరదీశాడు. వారికే టికెట్లు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా“ అని చంద్రబాబు నిలదీశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన `ప్రజాగళం` సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సభకు హాజరైన జనాలను చూసి చంద్రబాబు ముగ్ధులయ్యారు. “నాయుడుపేటలో నేడు జనసునామీ కనిపిస్తోంది. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పడానికి ఈ సభకు వచ్చిన జనమే నిదర్శనం. శిశుపాలుడు 100 తప్పులు చేసేవరకు శ్రీకృష్ణుడు క్షమించాడు. కానీ జగన్ వెయ్యి తప్పులు చేశాడు. మీరు క్షమిస్తారా? ప్రజలు ఎంతో నమ్మి ఓటేస్తే, అందరినీ నమ్మించి మోసం చేశాడు“ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
నాయుడుపేట ఎస్సీ నియోజకవర్గం అని, తాను రోడ్డు మార్గం ద్వారా వస్తుంటే, ప్రజలంతా జెండాలు చేతబూని చంద్రన్నా మీ వెంటే ఉంటాం అని నినదించారని చంద్రబాబు చెప్పారు. “నేను హామీ ఇస్తున్నా… పేదవారి పక్షానే ఉంటా, పేదవాడితోనే ఉంటా… పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రింబవళ్లు పనిచేస్తా“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. `జగన్ పెద్ద దొంగ. దొంగ దగ్గరకు దొంగే వెళ్లినట్టు.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడికి ఎమ్మెల్యే సీటు, దోపిడీ చేసేవాడికి ఎంపీ సీటు, లూటీ చేసేవాడికి గుర్తింపునిచ్చే పరిస్థితికి వచ్చాడు“ అని నిప్పులు చెరిగారు.
“నువ్వు బచ్చాగాడిలా గోలీలాడుకుంటున్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఓసారి చరిత్ర చూసుకో. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది నా వల్లే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే 8 పర్యాయాలు డీఎస్సీ పెట్టాం. టీడీపీ హయాంలో 11 సార్లు డీఎస్సీ జరిపాం. నేనడుగుతున్నా… నువ్వు ఐదేళ్లున్నావు… దిక్కుమాలినోడివి… ఎన్నిసార్లు డీఎస్సీ పెట్టావు? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చావా?“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.