“ఔను.. మేం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం. అలాగని కేసీఆర్‌కు ద్రోహం చేసినట్టు కాదు. రాజకీయాల్లో ఉన్న వారు ఎవరైనా అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయి. కాబట్టి మేం సరైన నిర్ణయమే తీసుకున్నాం“ అని బీఆర్ ఎస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్‌కు కుడిభుజంగా ఉన్న కే. కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తన కుమార్తె, హైదరాబాద్ నగర మేయర్.. విజయలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు.
తాము కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు కేశవరావు, ఆయన కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన తాము అధికార పార్టీలో చేరుతున్నామని, సీఎం రేవంత్ పనితీరు బాగుందని, అందుకే తాము పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని కేశవరావు వెల్లడించారు.
తాను గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని కేశవరావు గుర్తు చేశారు. 84 ఏళ్ల వయస్సులో తాను తిరిగి సొంత పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పారు. తన వర్గం కూడా ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. ఇదిలావుంటే.. కేశవరావు తనయుడు మాత్రం మరో నిర్ణయం తీసుకున్నారు. తాను కేసీఆర్‌తోనే ఉంటానన్నారు. ఈ మేరకు కేకే తనయుడు విప్లవ్ కుమార్ వెల్లడించారు. తన తండ్రి, సోదరి నిర్ణయాలతో తనకు సంబంధం లేదన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. అంతేకాదు.. బీఆర్ ఎస్‌ను వీడడం తన తండ్రి, సోదరి స్వవిషయంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు.