టీడీపీ నాయకురాలు.. ఫైర్ బ్రాండ్ నేత, కర్నూలుకు చెందిన భూమా అఖిల ప్రియను పోలీసులు ఘోరం గా అరెస్టు చేశారు. ఆమె గింజుకుంటున్నా వదిలి పెట్టకుండా.. ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి వ్యానులో కుక్కేశా రు. మరి దీనికి కారణమేంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. సీఎం జగన్ ప్రస్తుతం `మేం సైతం సిద్ధం` పేరుతో యాత్రలు చేస్తున్నారు ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ క్రమం లో ఆయన గురువారం నంద్యాల జిల్లా(ఉమ్మడి కర్నూలు)లో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో స్థానిక సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని భావించిన మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి అఖిల ప్రియ ఈ రోజు ఉదయం నుంచే ప్రిపేర్ అయ్యారు. అయితే.. తొలుత ఆమెను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు .. మధ్యాహ్నానికి.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇదే అదునుగా అఖిల ప్రియ తన మద్దతుదారులతో సీఎం జగన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు బయలు దేశారు. దీంతో పోలీసులు వీరిని చుట్టుముట్టారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పొలాలకు సంబంధించి సాగునీటి విడుదలకు సంబంధించి జగన్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన ఆమెను అరెస్టు చేయాలని చూశారు. అయితే.. ఆమె పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరుగులు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు పోలీసులను ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో అఖిల ప్రియను మహిళా పోలీసులు రెండుచేతులూ పట్టుకుని బరబరా ఈడ్చుకుంటూ ముందుకు తీసుకువెళ్లి వ్యాన్ ఎక్కించారు.
దీంతో సీఎం జగన్ పాల్గొననున్న సభా ప్రాంగణం వద్ద కలకలం రేగింది. వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎం కార్యాలయం స్పందించలేదని, అందుకనే నేరుగా సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని అఖిలప్రియ తెలిపారు. అయితే.. ఆమె ను పోలీసులు స్టేషన్కు తరలించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు టీడీపీ పిలుపునిచ్చినా.. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వెనక్కి తగ్గింది.