తన చిన్నాన్న, దివంగత నేత వివేకా హత్య జరిగిన ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో జగన్ తొలిసారి ఆ వ్యవహారంపై స్పందించిన సంగతి తెలిసిందే. తన చిన్నాన్న వివేకాను చంపిన హంతకులు తన చెల్లెళ్లను అడ్డుపెట్టుకొని తనను ఓడించాలనుకుంటున్నారని, అది సాధ్యం కాదని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ కేసులో తనపై బురద జల్లేవారికి తన చెల్లెళ్లు ఉపయోగపడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలపై వివేకా తనయురాలు వైఎస్ సునీతా రెడ్డి ఘాటుగా స్పందించారు. చిన్నాన్నకు న్యాయం జరగాలని చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే చెల్లిపైనే కేసులు పెట్టడం న్యాయమా? అని నిలదీశారు.
చిన్నాన్న చావు వెనుక ఉన్న కుట్రను ఐదేళ్లయినా నిర్ధారించలేదని, ఇప్పుడు ఎన్నికల ముందు చిన్నాన్న గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు చిన్నాన్న హత్యను రాజకీయాలకు వాడుకుని అధికారంలోకి వచ్చారని, ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారని నిలదీశారు. మీరు చేయాల్సింది సరిగా చేయనందునే తాను బయటికు రావాల్సి వచ్చిందని చెప్పారు. తాను చెప్పేదంతా నిజం… అని అలాగే మీరు చెప్పగలరా అంటూ జగన్ ను సునీత నిలదీశారు.
వివేకాను చంపిందెవరో దేవుడికి తెలుసని జగనన్న అంటున్నారని, వివేకాను ఎవరు చంపించారో హత్య చేసిన వ్యక్తి స్పష్టంగా చెబుతున్నారని అన్నారు. నిందితుల వెనుక అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నా మీ ప్రభుత్వం ఉండి నిందితులకు భద్రత కల్పిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా మీరే
సీబీఐ విచారణ కోరి.. ఆ తర్వాత వద్దన్నారని, మీ పేరు బయటికి వస్తుందనే సీబీఐ విచారణ కోరట్లేదా? అని నిలదీశారు. నిందితుడిని పక్కనబెట్టుకుని అతడికి ఓటు వేయాలని కోరుతున్నారని, మీ చిన్నాన్నను చంపిన వ్యక్తికి ఓటు వేయాలని అడగడం మీకు తప్పుగా అనిపించడంలేదా? అంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు.
2024 ఎన్నికల్లో సానుభూతి కోసమే చిన్నాన్నను తెరపైకి తీసుకువస్తున్నారని, నాది న్యాయపోరాటం, మీది పదవుల కోసం ఆరాటం అని విమర్శించారు. హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. అన్నీ మరిచిపోయి ఓటు అడిగేందుకు మీకు మనసెలా అంగీకరిస్తుంది? హత్య చేసిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని ఎలా తిరుగుతున్నారు అని ప్రశ్నించారు. హత్య చేసిన, చేయించిన వారితో తిరుగుతున్నట్టు ఆధారాలున్నాయని సునీత చేసిన వ్యాఖ్యలు జగన్ ను ఇరకాటంలో పడేశారు.