ఈ మధ్య ఓ పేరున్న సినిమా నుంచి ఏదైనా మంచి పాట రిలీజవ్వగానే దాన్ని ఆస్వాదించేలోపే.. ఈ పాటకు ఇన్స్పిరేషన్ ఇదీ అంటూ ఎక్కడ్నుంచో ట్యూన్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు నెటిజన్లు. ఫ్యామిలీ స్టార్ నుంచి రిలీజైన రెండు పాటలు.. వేరే సాంగ్స్‌కి కాపీల్లా అనిపించడంతో విమర్శలు తప్పలేదు. ఇక తమన్ అనే సంగీత దర్శకుడి మీద ఉన్న కాపీ ముద్ర ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎక్కడెక్కడి పాటలనో అనుకరించడం.. అలాగే తన పాత పాటల ట్యూన్స్‌నే రిపీట్ చేయడం.. తద్వారా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో తమన్ ట్రోలింగ్ ఎదుర్కోవడం ఎప్పట్నుంచో నడుస్తున్న వ్యవహారమే. ఐతే శంకర్ లాంటి మేటి దర్శకుడు, టఫ్ టాస్క్ మాస్టర్ సినిమా కాబట్టి ‘గేమ్ చేంజర్’ విషయంలో అలా జరిగే ఆస్కారమే లేదని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి వచ్చిన ‘జరగండి..’ పాట మీద కూడా కాపీ మార్క్ పడిపోయింది.
మొత్తంగా పాటను కాపీ అనలేం కానీ.. మొదట్లో వచ్చే హమ్మింగ్ వింటే.. ‘శక్తి’ సినిమాలోని ‘సుర్రో సుర్ర’ పాటకు చాలా దగ్గరగా అనిపిస్తోంది. ‘జరగండి..’ పాట రిలీజైన కొన్ని గంటల్లోనే ఈ రెండు పాటల మధ్య సారూప్యతను చూపించే వీడియోలు బయటికి వచ్చేశాయి. ఇలా ఎన్నిసార్లు దొరికేస్తావ్ తమన్.. అసలిలా తమన్ దొరక్కపోతేనే ఆశ్చర్యం అంటూ ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ని నెటిజన్లు ఎప్పట్లాగే ఒక ఆట ఆడేసుకుంటున్నారు.
కానీ అనుకోకుండా కొన్ని మ్యూజికల్ కోయిన్సిడెన్స్లు జరగడాన్ని అర్థం చేసుకోవచ్చు. మిగతా పాటంతా ఓకే కాబట్టి తమన్‌ను మన్నించేయొచ్చు. ఇక ఓవరాల్‌గా ‘జరగండి’ పాట విషయానికి వస్తే ఇది బ్లాక్ బస్టర్ సాంగ్ అనలేం.. అలా అని తీసిపడేయలేం. ఓ మోస్తరుగా అనిపిస్తోంది. ఐతే ఈ పాట విజువల్‌గా ఇచ్చే అనుభూతే చాలా ప్రత్యేకంగా ఉంటుందని లిరికల్ వీడియోను చూస్తే అర్థమవుతోంది.