వైసీపీ నాయకురాలు, మంత్రి, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రోజాపై టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారి పేరుపెట్టి మరీ సటైర్లు వేశారు. ప్రస్తుతం చంద్రబాబు `ప్రజాగళం` పేరుతో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఆయన యాత్ర చేశారు. ఈ సందర్భంగా రోజాపై చంద్రబాబు సటైర్లతో విరుచుకుపడ్డారు. “రోజా నియోజకవర్గంలో గెస్ట్ ఆర్టిస్టు.. బుల్లి తెరపై ఫుల్లు ఆర్టిస్టు“ అని వ్యాఖ్యానించారు.
“ఇక్కడొక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉంది. ఆమె పేరే రోజా. ఈవిడ నాటు రోజా కాదు. హైబ్రిడ్ రోజా. అందుకే పని తక్కువ.. నస ఎక్కువ అని నియోజకవర్గంలోనే తమ్ముళ్లు చెబుతున్నారు“ అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. “రోజా తనను తాను గొప్పగా చెప్పుకొంటుంది. జబర్దస్త్ షోలు చేస్తూ.. రెండు చేతలా సంపాయించుకుంటూ.. ప్రజలను గాలికి వదిలేసింది. ఇప్పుడు మీరు కూడా ఆమెను గాలికి వదిలేసేయండి“ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో చిత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. భువనేశ్వరి తన వద్దకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుందని చంద్రబాబు వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ గా చేస్తామని ఆమె నుంచి రూ.40 లక్షల తీసుకున్నారంటే వీళ్లను ఏమనాలి? అంటూ పరోక్షంగా రోజాపై ధ్వజమెత్తారు. ఇలాంటి పనిచేసిన వాళ్లకు మీరు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. అదేసమయంలో రోజా బ్రదర్స్పైనా నిప్పులు చెరిగారు. “ఈ రోజాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. వారిద్దరూ బకాసురులు. అన్నింటినీ అమ్ముకుంటున్నారు. ఆబగా జనాల సొమ్మును తినేస్తున్నారు“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వేదికపై ఉన్న కౌన్సిలర్ భువనేశ్వరిని “ముందుకు రామ్మా” అంటూ చంద్రబాబు పిలిచారు. ఆమె వచ్చిన అనంతరం… ప్రజలు ఈ ఆడబిడ్డకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే, ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న జగన్ తీరు ఇంకెలా ఉంటుంది? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నగరి నియోజకవర్గం అంతా అరాచకం అని మండిపడ్డారు. కాగా, నగరి నియోజకవర్గం టికెట్ ను గాలి భాను ప్రకాష్ నాయుడుకి ఇచ్చిన విషయం తెలిసిందే.