మరో నెలన్నర రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఓ పక్క వైసీపీ అధినేత జగన్ , మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు పోటాపోటీగా ప్రచారాన్ని మొదలుబెట్టారు. తన సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరు బహిరంగ సభతో జగన్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టగా…తన సొంత జిల్లా చిత్తూరులోని పలమనేరు నుంచి చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని తొలి బహిరంగ సభతో పూరించారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ , వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ప్రజా గళం పేరుతో ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి సభకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. “వీరుడు వస్తున్నాడు… అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి” అని జగన్ పై సెటైర్లు వేస్తూ చంద్రబాబు పిలుపునిచ్చారు. సీమకు అన్యాయం చేసిన ఆ ద్రోహి పరదాలు దాటి వస్తున్నాడని, తమ ప్రాంతానికి రావడానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నినదించాలని కోరారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలవాలంటే.. జగన్ దిగిపోవాలని అన్నారు. బీజేపీతో టిడిపి పొత్తును విమర్శిస్తున్నారని, గత ఐదేళ్లుగా బీజేపీకి మద్దతిచ్చింది వైసీపీ కాదా? అని ప్రశ్నించారు.
గతంలో ఎన్డీయే భాగస్వామిగా టిడిపి ఉన్నప్పుడు ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో వివిధ ప్రాజెక్టులను 90 శాతం పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడం జగన్ కు చేతకాలేదని ఎద్దేవా చేశారు. రాయలసీమను రాళ్లసీమగా మార్చిన జగన్ కు ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. సిద్ధం అంటూ వస్తున్న జగన్ ను ఇంటి దారి పట్టించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు సమర శంఖం పూరించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన జగన్ అనే శని వదిలిపోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, పోలింగ్ తేదీ మే 13 కోసం ఎదురుచూస్తున్నారని చంద్రబాబు అన్నారు. అరాచకపాలన, దోపిడీ, డ్రగ్స్, గంజాయి, జే బ్రాండ్ మద్యం.. నుంచి విముక్తి కలిగించే రోజు… మే 13 అని చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.