ఇంటికి కేజీ బంగారం పంచినా.. వైసీపీకి ఓటమే అని టీడీపీయువనాయకుడు, మంగళగిరి అభ్యర్థి నారా లోకోష్ వ్యాఖ్యానించారు. తాజాగా వైసీపీ అభ్యర్థులకు సంబంధించిన ప్రలోభాల వ్యవహారం బయటకు రావడంతో ఆయన మరింత టార్గెట్ చేశారు. తాజాగా, రేణిగుంటలో వైసీపీ నేతకు చెందిన గోడౌన్లో ఓటర్లకు పంచేందుకు సిద్దంగా ఉన్న చేతిగడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతోపాటు మొత్తంగా 52 రకాల వస్తువులను అధికారులు పట్టుకున్నారు.
దీనిపై టీడీడీ యువ నేత నారా లోకేష్ స్పందించారు. ఐదేళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన జనం జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలన్న నిర్ణయానికి వచ్చారని వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసిన జగన్ చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారని, అది సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సిద్ధం చేసిన డంప్‌ను అధికారులు పట్టుకున్నారని నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్‌ను పట్టుకున్నారని, మరి ఇసుక, లిక్కర్లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధంచేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా ప్రజల ఆగ్రహజ్వాలల్లో వైసీపీ ధ్వం సం అవుతుందన్నారు. ఈ విషయాన్ని జగన్ గుర్తించాలని అన్నారు.
జగన్ కార్యాలయంలోకి కంటెయినర్..
ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే రోజూ తన కాన్వాయ్ ను తనిఖీ చేసే పోలీసులకు సీఎం క్యాంప్ ఆఫీసులోకి కంటైనర్ వెళ్లడం కనిపించలేదా? అని లోకేష్ ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం సీఎం ఇంటి సమీపంలోకి వెళ్లి కంటైనర్ వ్యవహారం ఏంటని ప్రశ్నించారు. మిగతా వాహనాలలాగా కాకుండా రాంగ్ రూట్ లో వెళ్లడం, సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ కంటైనర్ సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎందుకొచ్చింది.. ఏం తెచ్చిందంటూ నిలదీశారు. ఇందులో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన పోలీసులకు కనిపించలేదా? అని ప్రశ్నించారు.