దేశాన్ని దోపిడీ చేసిన వారిని, దేశ ద్రోహులను ఉంచే తీహార్ జైలుకు బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ను పంపించారు. ఇది కేసీఆర్ కుటుంబానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే కవిత అరెస్టుతో కేసీఆర్ మొహం చూపించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు కరడు గట్టిన ఉగ్రవాదులు, ముఠాకోరులు, త్రీవవాదులు, దోపిడీ దారులను ఉంచే.. తీహార్ జైలుకు తన కుమార్తెను పంపించడం.. ఆయనకు మరింత ఇబ్బందిగా మారింది.
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 వరకూ ఆమెకు రిమాండ్ విధించగా.. అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఈ కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. మళ్లీ తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరగా అందుకు నిరాకరించిన న్యాయస్థానం కవితకు రిమాండ్ విధించింది. ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి ఇచ్చామని.. మరోసారి ఇవ్వలేమని పేర్కొంటూ రిమాండ్ విధించింది.
హరీష్ రావు ఫైర్
కాగా, బీజేపీపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని.. వాళ్లతో ఒప్పందం పెట్టుకోలేదనే కవితను తీహార్ జైలుకు పంపారని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. ‘ఒప్పందం పెట్టుకుంటే కవిత అరెస్ట్ అయ్యేవారా.?’ అని ప్రశ్నించారు. నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైల్లో ఉండాలి అన్నట్టుగా బీజేపీ వైఖరి ఉందని మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని.. కేసీఆర్ ఎప్పుడూ బీజేపీతో కలిసేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.