రాష్ట్రంలోని వలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదన వచ్చేలా వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. వారి జీవితాలు మారుస్తామని తెలిపారు. అయితే, వలంటీర్లు నీతి, నిజాయితీగా ఉండాలని చెప్పారు. వైసీపీ చెప్పిన పనులు చేస్తే మాత్రం జైలుకెళ్తారని హెచ్చరించారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ఇక్కడి యువతతో భేటీ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గాని కి అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు నిర్మిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు.
యువతకు సామాజిక బాధ్యత ఉండాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తామని సీఎం వైఎస్ జగన్ యువత ను మోసం చేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు మాత్రం డీఎస్సీ పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్-1 ఉద్యోగాలను నచ్చినవారికి ఇచ్చుకున్నారని ఆరోపించారు.
పొత్తుపై మళ్లీ..
వచ్చే ఎన్నికల్లో తాము బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నామో.. చంద్రబాబు మరోసారి వివరించారు. ఏపీని కాాపాడుకునేం దుకు పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. టీడీపీ, జనసేన , బీజేపీ అందుకే కలిశాయన్నారు. జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు భూములు కొల్లగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సర్వే నంబర్స్ మార్చి ప్రజల భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. సొంత నియోజకవర్గం కప్పుంలోనూ తనకు కూడా బెదిరింపులు తప్పటం లేదన్నారు. ఇక ఏపీలో సామాన్యుల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో `జే బ్రాండ్` మద్యాన్ని నిషేధిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తన హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలతో కొత్తదారి చూపించానని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అక్రమార్కుల చేతుల్లో పడితే చాలా ప్రమాదకరమని చంద్రబాబు హెచ్చరించారు. పారదర్శకంగా జరగాల్సిన పాలనలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.