విధి నిర్వహణలో ఉన్న పోలీసులు మిగిలిన వారి కంటే బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందన్న కనీస విషయాన్ని మర్చిపోతున్నారు. కొందరు అధికారుల తీరు మొత్తం డిపార్టుమెంట్ కు చెడ్డపేరు తెచ్చేలా ఉండటం తెలిసిందే. ఏపీలో జరుగుతున్న ఎన్నికల వేళ.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు రాజకీయ పార్టీలు.. మరోవైపు కొందరు పోలీసులు.. ఇంకొకవైపు మరికొందరు రాజకీయ నేతల అతి పీక్స్ కు చేరటమే కాదు.. వారి మాటలు.. చేతలు వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు కారంపూడి సీఐ చిన్నమల్లయ్య.
కాంరపూడి కొత్త బస్టాండ్ వద్ద టీ స్టాల్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు టీ తాగుతున్నారు. వీరున్న ఆ ప్లేస్ ను చూసిన కారంపూడి పోలీసులు ఎస్ఐకు సమాచారం ఇవ్వటం.. ఆ వెంటనే ఆయన ఆ టీ స్టాల్ వైపు రెండు రౌండ్లు వేయటం చేశారు. టీ స్టాల్ వద్ద టీడీపీ నేతలు ఉన్నారన్న సమాచారాన్ని సీఐ చిన్నమల్లయ్యకు సమాచారం ఇచ్చారు. అంతే.. నిమిషాల్లో టీ స్టాల్ వద్దకు చేరుకున్న సీఐ.. తన నోటికి పని చెప్పారు. టీ తాగుతున్న వారంతా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. అయినా టీ స్టాల్ వద్ద మీకేం పని అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు.
అదే సమయంలో టీడీపీ నేతలతో ఉన్న ఒక దివ్యాంగుడి మీద లాఠీతో తన ప్రతాపాన్ని ప్రదర్శించారు. దీంతో అప్పటివరకు సహనంతో ఉన్న టీడీపీ నేతలు తాము టీ తాగుతున్నామని.. అక్కడి నుంచి ఎందుకు వెళ్లాలంటూ ప్రశ్నించారు. టీ తాగటం కూడా తప్పేనా? అని ప్రశ్నంచారు. ఆ మాటకు మరింత ఆగ్రహాన్ని ప్రదర్శించిన సీఐ.. నన్నే ఎదిరిస్తావా? పదరా స్టేషన్ కు అంటూ హుకుం జారీ చేశారు.
తాము ఎలాంటి తప్పు చేయలేదని.. తాము స్టేషన్ కు ఎందుకు రావాలి? అని ప్రశ్నించటంపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు సీఐ చిన్నమల్లయ్య. తననే ప్రశ్నిస్తారా? ఎంత ధైర్యం అంటూ.. ‘‘ఓయే.. పోలీస్ స్టేషన్ కు వస్తావా? రావా? కాల్చి పడేస్తా. ఏమనుకుంటున్నావో.. రౌడీషీట్ తెరిచి లాకప్ లో వేస్తా’’ అన్న ఘాటు వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. మాటలతోనే కాదు.. టీడీపీ శ్రేణులకు చెందిన చప్పిడి రామును వాహనంలో ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకెళ్లారు. దీనిపై టీడీపీనేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
దీంతో పోలీసులు కాస్తంత తగ్గారు. పూచీకత్తు సమర్పించి చప్పిడి రామును విడుదల చేశారు.అక్రమ అరెస్టుల్ని ప్రజలంతా చూస్తున్నారని.. తగిన బుద్ధి చెబుతారంటూ మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణానికి తెర తీసింది. అయితే.. టీ స్టాల్ వద్ద గుంపుగా ఉన్నందునే పోలీసులు అక్కడకు వెళ్లి.. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరినట్లుగా ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.